మంత్రి Vs ఎమ్మెల్యే.. ఏడాది కాకుండానే రోడ్డెక్కిపోయారు!
కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. మూడు పార్టీల భాగస్వామ్యంతో ఏర్పడిన చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో మిత్రపక్షాలతోనే కాదు సొంత పార్టీల్లోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది.
By: Tupaki Desk | 20 April 2025 7:03 PM ISTకూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. మూడు పార్టీల భాగస్వామ్యంతో ఏర్పడిన చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో మిత్రపక్షాలతోనే కాదు సొంత పార్టీల్లోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. అందరినీ ఓ కంట కనిపెడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు తలదూర్చుతున్నారనే కారణంతో రోడ్డెక్కడానికి కూడా సిద్ధమైపోతున్నారు. తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి చర్చనీయాంశమవుతోంది.
నూజివీడు నియోజకవర్గం నుంచి మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తుండగా, గన్నవరం నుంచి ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే సొంత నియోజకవర్గంలో నేతలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. తాజాగా మంత్రి కొలుసు పార్థసారథితోనూ వివాదానికి సై అంటున్నారని టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం (ఏప్రిల్ 18) మంత్రి కొలుసు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు గన్నవరంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వీటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీనికి కారణం ఎమ్మెల్యే యార్లగడ్డ అనుచరులే అంటూ మంత్రి అభిమానులు ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజులుగా మంత్రి పార్థసారథితో ఎమ్మెల్యే యార్లగడ్డకు పొసగడం లేదని చెబుతున్నారు. మంత్రి నియోజకవర్గంలోని అక్రమ మైనింగు చేస్తున్నారని, రోజూ వందలాది వాహనాలు తన నియోజకవర్గం మీదుగా వస్తూ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే యార్లగడ్డ మూడు నెలల క్రితం ఆరోపించారు. దీనిపై మంత్రి పార్థసారథి కలగజేసుకున్నారు. అబద్ధ సమాచారం, అవగాహన లోపంతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ప్రచారమైంది. దీనికి కొనసాగింపుగా తాజాగా ప్లెక్సీలు చించివేత జరిగిందని విమర్శలు చేస్తున్నారు మంత్రి అనుచరులు.
ఈ పరిణామాలపై టీడీపీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్టీలో ఇద్దరు ప్రముఖ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కరెక్టు కాదని, ఎన్నికలు జరిగి ఏడాది కాకుండా ఈ కుమ్ములాటలేంటని కార్యకర్తలు మండిపడుతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. టీడీపీకి ప్రతిష్ఠాత్మకమైన గన్నవరం నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం మంచిది కాదని అంటున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఏం చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
