'మత్స్యకార పేటెంట్' ఇక.. బాబుదే జగన్... !
కానీ.. చంద్రబాబు జూన్ 12న పగ్గాలు చేపట్టారు. దీంతో ఆ ఏడాది ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం రూ.20 వేల చొప్పున మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్నారు.
By: Tupaki Desk | 27 April 2025 7:09 AM''మత్స్యకారులకు మేలు చేయడంలో మేమే ముందున్నాం. ఎవరైనా పేటెంట్ ఇవ్వాలని అనుకుంటే అది మాకు.. మా ప్రభుత్వానికే ఇవ్వాలి!''-2020లో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇంకా రింగురింగులుగా తిరు గుతూనే ఉన్నాయి. దీనికి కారణం.. అప్పటివరకు రూ.4 వేలుగా ఉన్న మత్స్యకారుల భృతిని.. రూ.6 వేలు పెంచి.. ఏకంగా రూ.10 వేలు చొప్పున ఇవ్వడమే!
మత్స్యకారులకు ఏటా రెండు మాసాల పాటు.. సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తారు. ఏప్రిల్-జూలై మాసాల మధ్య నిర్దేశిత సమయంలో చేపలు.. ఇతర సముద్ర జీవులు.. పునరుత్పత్తిచేసుకునే సమయంగా నిర్ధారిస్తారు. ఈ సమయంలో అవి స్వేచ్ఛగా ఉండేలా.. కేంద్రం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఈ క్ర మంలో సదరు నిషేధ కాలానికి సంబంధించి ప్రభుత్వం వారిని ఆదుకుంటోంది. ఇలా.. టీడీపీ హయాంలో నే తొలిసారి.. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సూచనల మేరకు.. చంద్రబాబు మత్స్యకారులకు సాయం అందించే పథకాన్ని ప్రారంభించారు.
తొలిసారి రూ.2000లతో ప్రారంభించిన ఈ పథకాన్ని తర్వాత కాలం రూ.4 వేలకు పెంచారు. ఇక, వైసీపీ 2019 ఎన్నికలకుముందు.. ఈ పథకాన్ని మరింత విస్తరించి.. రూ.4 వేలను రూ.10వేలకు చేసింది. దీనిని ప్రస్తావించిన జగన్.. పైవిధంగా.. 'పేటెంట్ వ్యాఖ్యలు' చేశారు. కానీ, పరిస్థితి మారిపోయింది. రా.. కదలిరా! సభల నిమిత్తం.. రెండేళ్ల కిందట.. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సమయంలో తమ కష్టాలు చెప్పుకొన్న మత్స్యకారుల పట్ల ఆయన ఉదారత ప్రదర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. రూ.20 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు.
ఆ ఘడియ రానే వచ్చింది. గత ఏడాది కూటమి సర్కారు వచ్చింది. అయితే.. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టే నాటికి వేట నిషేధ గడువు అయిపోయింది. అప్పట్లో ఏప్రిల్ -12 నుంచి జూన్15వతేదీ వరకు నిషే ధం అమలైంది. కానీ.. చంద్రబాబు జూన్ 12న పగ్గాలు చేపట్టారు. దీంతో ఆ ఏడాది ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం రూ.20 వేల చొప్పున మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్నారు. ఇది వైసీపీ ఇచ్చిన దానికంటే.. రెండు రెట్లు ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటి వరకు మత్స్యకార భరోసా(కూటమి హయాంలో.. దీనికి 'మత్స్యకారుల సేవలో' అనే పేరు పెట్టారు) పేటెంట్ తమదేనని చెప్పుకొన్న జగన్‌కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందన్న వాదన టీడీపీ నేతల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.