టీడీపీలో ఇదేం సంస్కృతి.. చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో ఘోర వైఫల్యం?
అయితే, నెల్లూరు జిల్లాలో మాత్రం టీడీపీ నేతలు మాలేపాటి అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం తీవ్ర దుమారం రేపింది.
By: Tupaki Political Desk | 31 Oct 2025 9:00 PM ISTనెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన ఏపీ అగ్రోస్ చైర్మన్, దివంగత మాలేపాటి సుబ్బానాయుడు మరణం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ నేతలు ఆయన అంత్యక్రియలకు వెళ్లకపోవడమే కాకుండా, పెద్దకర్మనాడు కూడా పార్టీ తరఫున సరైన విధంగా వ్యవహరించలేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇది పార్టీలో కొత్త సంస్కృతికి తెరలేపినట్లైందని కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీనే నమ్ముకుని పార్టీయే సర్వశ్వంగా భావించిన వారిని అవమానించడం, మరణించిన తర్వాత కూడా సరైన గౌరవం ఇవ్వకపోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కావలి నియోజకవర్గానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన అన్న కుమారుడు భానుచందర్ పది రోజుల క్రితం మరణించారు. సుబ్బానాయుడు పార్టీలో 40 ఏళ్లుగా కొనసాగుతుండగా, 2024 ఎన్నికల వరకు కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. ఇక ఆయన సోదరుడు కుమారుడు భానుచందర్ సైతం పార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన సుబ్బనాయుడు చివరి నిమిషంలో అవకాశం దక్కించుకోలేకపోయారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కావ్య కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పార్టీ ఆదేశాలతో కావ్య కృష్ణారెడ్డి గెలుపునకు సుబ్బనాయుడు పనిచేశారని కార్యకర్తలు చెబుతున్నారు.
అయితే ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేతో సుబ్బనాయుడుకి విభేదాలు మొదలయ్యాయని అంటున్నారు. ఎమ్మెల్యే ఆయనను దూరం పెట్టారని కూడా ప్రచారం ఉంది. అయితే పార్టీ మాత్రం సుబ్బనాయుడు సేవలను గుర్తించి నామినేటేడ్ పదవిని అప్పగించింది. ఏపీ అగ్రోస్ చైర్మన్ హోదాలో ఆయన రాజధాని అమరావతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైన మాలేపాటి అక్టోబరు 20వ తేదీన తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని అన్నకుమారుడు భానుచందర్ సైతం అదే ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేశ్ ఆస్పత్రికి వెళ్లి మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించారు.
అయితే, నెల్లూరు జిల్లాలో మాత్రం టీడీపీ నేతలు మాలేపాటి అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం తీవ్ర దుమారం రేపింది. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ సుబ్బనాయుడు అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ సైతం పార్టీ నేత అంతిమ సంస్కారాలను విస్మరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక నారాయణ వారం రోజుల తర్వాత పరామర్శకు వెళ్లడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు. అయితే నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత ఆంక్షలతోనే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరూ సుబ్బనాయుడు అంతిమ సంస్కారాలకు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గురువారం కావలి నియోజకవర్గంలోని జరిగిన పెద్దకర్మకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెళ్లగా కార్యకర్తలు ‘గో బ్యాక్’ నినాదాలతో హోరెత్తించారు. ఈ పరిణామం టీడీపీలో విస్తృత చర్చకు దారితీసింది. ఎవరైనా మరణిస్తే నివాళులు అర్పించడం కనీస సంస్కారమని, పార్టీకి 40 ఏళ్లుగా సేవలు అందించిన వారి విషయంలో నడుచుకునే పద్ధతి ఇదేనా? అంటూ కార్యకర్తలు జిల్లా నేతలపై మండిపడుతున్నారు. ఈ విషయంలో అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో కూడా వైఫల్యం కనిపిస్తోందని మీడియా అనలిస్టులు నిష్టూరమాడుతూ వీడియోలు చేయడం గమనార్హం. టీడీపీ అనుకూల మీడియాలో కూడా సుబ్బనాయుడు విషయంలో ఎమ్మెల్యే, మంత్రులు వ్యవహరించిన పద్ధతిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
