డైరెక్ట్ ఎలక్షన్...టీడీపీ మాస్టర్ ప్లాన్ వెనక ?
దాంతో పాటే సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అందుకే తరుణోపాయంగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ఎంచుకుంది అని చెబుతున్నారు.
By: Satya P | 21 Aug 2026 8:32 AM ISTమేయర్, మున్సిపల్, జిల్లా మండల పరిషత్తు చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించడం వెనక మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు అన్న రాజనీతి దాగుంది అని అంటున్నారు. పరోక్ష ఎన్నికలు అయితే ఎన్నో చిక్కులు చికాకులు వెంటాడుతూంటాయి. వైసీపీ హయాంలో అయితే ఈ పదవులకు అవిశ్వాస తీర్మానానికి నాలుగేళ్ళ లాకింగ్ పీరియడ్ ని విధించింది. అయినా చివరి ఏడాది మాత్రం ఆ పార్టీకి అన్ని చోట్లా ఎసరు తగిలింది. ఇక కూటమి ఆ లాకింగ్ పీరియడ్ ని తగ్గించాలని ఒత్తిడి వస్తుంది. దాంతో పాటే సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అందుకే తరుణోపాయంగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ఎంచుకుంది అని చెబుతున్నారు.
వైసీపీకి తొలి దెబ్బ :
డైరెక్ట్ ఎన్నికల ద్వారా వైసీపీకి తొలి దెబ్బ తీయాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. వైసీపీకి ఇపుడు చాలా నియోజకవర్గాలలో బలహీనమైన ఇంచార్జిలు ఉన్నారని, స్థానిక ఎన్నికల పట్ల పెద్దగా ఆ పార్టీలో ఉత్సాహం కనిపించడం లేదని కూడా అంటున్నారు. అదే సమయంలో పరోక్ష విధానం అయితే ఎన్నో కొన్ని వైసీపీ గెలిచినా ఆ పార్టీకి ఉన్న నంబర్ కూడా ఎక్కడో ఒక చోట కీలకం అవుతుందని అలాంటి పరిస్థితి లేకుండా ముందే చెక్ పెట్టేస్తే సరిపోతుంది అన్నదే టీడీపీ వ్యూహ రచన అని అంటున్నారు. అంతే కాకుండా వైసీపీకి బలం ఉన్న ప్రాంతాలలో కూడా కూటమిగా ఐక్యంగా ముందుకు వెళ్తే ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి జనం మద్దతు అందుకుంటే ఆ చాన్స్ కూడా లేకుండా చేయవచ్చు అన్న ఎత్తుగడ ఉంది అని అంటున్నారు.
మిత్రుల డిమాండుకు కూడా :
ఇక పరోక్ష ఎన్నికలు అయితే ప్రతీ రెండేళ్ళకు మేయర్ సీటు కానీ చైర్మన్లు కానీ మార్చేందుకు వీలు ఉంటుంది. మిత్ర పక్షాల నుంచి కూడా దీని మీద డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం అయిదేళ్ళను వంతులుగా వేసుకుంటే అది రాజకీయంగా అస్థిరతకు దారి తీయవచ్చు అదే సమయంలో వైసీపీకి అనవసరంగా చాన్స్ ఇచ్చినట్లు అవుతుంది అని కూడా టీడీపీ ఆలోచిస్తున్నారు. అభివృద్ధి కూడా కుంటుబడుతుందని ఈ కుర్చీలాట జనంలోనూ విసుగు తెప్పించి మొత్తం కూటమి ప్రభుత్వం మీదనే అది వ్యతిరేక ప్రభావం చూపించే ప్రమాదం ఉందని కూడా ఆలోచించి నేరుగా ఎన్నికలు అన్న పవర్ ఫుల్ స్టాటజీని టీడీపీ రచించింది అని అంటున్నారు.
ముందే సర్దుకుంటే కనుక :
ఇక ఉన్న పదవులలో మిత్రులతో కలసి ముందే కనుక సర్దుబాటు చేసుకుంటే ఏ రకమైన పొరపొచ్చాలకు తావు లేకుండా అంతా బలమైన రాజకీయ శక్తిగా మారి మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకోవచ్చు అన్నది కూడా ఆలోచనగా ఉంది అని అంటున్నారు. అలాగే స్థానిక ఎన్నికలు జరిగిన ప్రతీ సారీ మేయర్ చైర్మన్లు ఎవరు అన్నది చూసుకోవడం వారి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆ బెడద ఏదీ లేకుండా నేరుగా వారిని రాష్ట్ర స్థాయిలోనే అన్నీ చూసుకుని ఎంపిక చేస్తే పూర్తి స్థాయిలోనే ఎన్నికల మీద ఫోకస్ పెట్టవచ్చు అన్నది కూడా మరో రకమైన ఆలోచనగా ఉంది. ఇక ప్రజలకు నేరుగా మేయర్ చైర్మన్లు ఎన్నుకునే అవకాశం ఇస్తే కనుక వారు కచ్చితంగా ఆనందిస్తారు అని అది కూడా అనుకూల ఫలితాలు వచ్చందుకు వీలు కల్పిస్తుందని టీడీపీ భావిస్తోంది. మొత్తానికి డైరెక్ట్ ఫైట్ అంటూ టీడీపీ బరిలోకి దూసుకుని రావడం వెనక బహుముఖ వ్యూహమే ఉందని అంటున్నారు.
