Begin typing your search above and press return to search.

తెలంగాణాలో టీడీపీ బిగ్ సౌండ్... సై అంటున్న చంద్రబాబు !

తెలుగుదేశం పార్టీ తన రాజకీయ విస్తరణను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తోందా అంటే అవును అనే జవాబు వస్తోంది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 6:21 PM IST
తెలంగాణాలో టీడీపీ బిగ్ సౌండ్... సై అంటున్న చంద్రబాబు !
X

తెలుగుదేశం పార్టీ తన రాజకీయ విస్తరణను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తోందా అంటే అవును అనే జవాబు వస్తోంది. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ వాటాను తేల్చుకోవాలని చూస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణా గడ్డ మీద.

అక్కడ నుంచే ఇంతింతై వటుడింతే అన్నట్లుగా పార్టీ పెరిగింది, ఎదిగింది. జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని బలంగా చాటుకుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ కొన్ని రాజకీయ ప్రాంతీయ సమీకరణల వల్ల తెలంగాణా రాజకీయ తెర మీద కొంతకాలం నుంచి దూరంగా ఉంటోంది. అంత మాత్రం చేత తెలుగుదేశం ఆశలు తీరిపోయాయని అర్ధం కాదు అని అంటున్నారు.

ఈ రోజుకు చూస్తే కూడా తెలంగాణాలో టీడీపీకి పట్టు ఉంది. బలమైన నాయకులు లేకపోవచ్చు కానీ క్యాడర్ ఇంకా చాలా చోట్ల ఉన్నారు. ముఖ్యంగా చూస్తే కొన్ని కీలక జిల్లాలలో టీడీపీకి బలం ఉంది. అలా సంస్థాగతంగా వేళ్ళూనుకున్న టీడీపీని ఉమ్మడి ఏపీ విభజన కొంత ఇబ్బంది పెట్టింది అని చెప్పాల్సి ఉంది. అయినా సరే 2014 ఎన్నికల్లో చూస్తే కనుక టీడీపీ మొత్తం అసెంబ్లీలో 119 సీట్లకు గానూ 19 సీట్లను గెలుచుకుంది. ఇది చాలా పెద్ద నంబర్ కిందనే లెక్క.

టోటల్ అసెంబ్లీలో 15 శాతం కంటే ఎక్కువ అని కూడా చెప్పాలి. అయితే 2018 నాటికి టీడీపీ బలం బాగా తగ్గింది. ఆ తరువాత టీడీపీ ఏపీలో కూడా ఓటమి పాలు కావడం జగన్ ఏపీలో అధికారంలోకి రావడం చంద్రబాబు మీద టీడీపీ మీద ఆయన తన రాజకీయ వ్యూహాలను బలంగా అమలు చేయడంతో వాటిని తట్టుకునే క్రమంలో టీడీపీ పూర్తి స్థాయిలో ఏపీ మీదనే దృష్టి సారించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ కారణం చేతనే 2023లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేక దూరంగా ఉండిపోయింది. అయితే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలన ముగిసింది. ఇపుడు అత్యంత బలంగా ఏపీలో టీడీపీ ఉంది. దాంతో పాటు నాలుగవ సారి చంద్రబాబు సీఎం కావడం అన్నది తెలంగాణా తెలుగుదేశం రాజకీయాల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చూపు ఇపుడు తెలంగాణాలో రాజకీయంగా బలపడే అంశం మీద ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే తెలుగు దేశం పార్టీ తెలంగాణ గడ్డపై పుట్టింది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి మా పార్టీ ప్రారంభమైంది. తెలుగు దేశం తెలుగు సమాజం ఎక్కడ ఉన్నా వారికి అండగా నిలుస్తుంది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందని నేను నిశ్చయంగా ధృవీకరించగలను అని బాబు ఇటీవల పాడ్‌కాస్ట్‌లో ధృవీకరించారు.

దాంతో టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తుంది అన్నది ధృవీకరణ అయిపోయింది. మరో వైపు చూస్తే కనుక తెలంగాణా రాజకీయం త్రిముఖ పోరులో సాగుతోంది. అధికార కాంగ్రెస్ విపక్షంలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఉన్నాయి. ఇక తెలుగుదేశం ఎంటీ ఇస్తే ఏ విధంగా తన పాత్ర పోషిస్తుంది అన్న చర్చ కూడా ఉంది.

తెలుగుదేశం పార్టీకి ఏపీలో బీజేపీతో జనసేనతో పొత్తు ఉంది. మూడు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏపీలో తీసుకుని వచ్చాయి. దాంతో 2028 ఎన్నికల నాటికి తెలంగాణాలోనూ ఎన్డీయే కూటమి ఏర్పడే అవకాశాలను కూడా ఎవరూ కొట్టిపారేయడం లేదు అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీకి తెలంగాణలో రాజకీయంగా చూస్తే కనుక పరిస్థితులు మళ్ళీ సానుకూలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు

అయితే సరైన నాయకత్వాన్ని గట్టి నాయకుడిని ఒక ఇమేజ్ ఉన్న వారిని కనుక తెలంగాణా రాజకీయ తెర మీద తెలుగుదేశం ఉంచగలిగితే మాత్రం కచ్చితంగా బలంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలుగుదేశానికి ఎటూ తెలంగాణా రాజకీయాల మీద ఆసక్తి పూర్తి స్థాయిలో ఉన్నందువల్ల కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుంది అన్నదే చర్చగా ఉంది. కొత్త సారధి బలంగా ఉంటే చంద్రబాబు వ్యూహాలు ఎత్తులు అన్నీ కలసి తెలంగాణాలో పసుపు జెండాను రెపరెపలాడించేందుకు రంగం సిద్ధం చేస్తాయని అంటున్నారు.