'కాఫీ' కబుర్లు కావు.. టీడీపీ భవిష్యత్ వ్యూహాలు.. !
టీడీపీ నాయకత్వం పార్టీ నాయకులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు.. శిక్షణ శిబిరాలను నిర్వహించిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 17 May 2026 8:00 PM ISTటీడీపీ నాయకత్వం పార్టీ నాయకులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు.. శిక్షణ శిబిరాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌లు.. `కాఫీ కబుర్లు` పేరు తో కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ కార్యక్రమం ఈ ఇద్దరు నాయకులకు మాత్రమే పరిమితం చేశారు. శిక్షణ సమయంలోనే వీరిద్దరు కూడా నాయకులకు చేరువై.. కాఫీ కబుర్లు పేరుతో కార్యకర్తలకు -నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు.
అయితే.. కొందరు ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నట్టు పార్టీకి సమాచారం అందింది. దీంతో కాఫీ కబుర్లు కార్యక్రమానికి సంబంధించి నారా లోకేష్ మరోసారి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాఫీ కబుర్లు కావని.. పిచ్చాపాటీ కార్యక్రమం కూడా కాదని.. పార్టీకి సంబందించినంత వరకు ఇది.. భవిష్య త్ వ్యూహాలను అమలు చేసే అతి పెద్ద కార్యక్రమమని నాయకులకు తేల్చి చెప్పారు. ఒక కార్యక్రమాన్ని భిన్నంగా నిర్వహిస్తే.. దానిని లైట్ తీసుకుంటామంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయిన నారా లోకేష్.. కాఫీ కబుర్లు కార్యక్రమం ఇచ్చిన రిజల్ట్‌పై ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో జరిగిన మార్పులు తెలుసుకున్నారు. చాలా మంది కార్యకర్తలకు.. నాయకుల కు మధ్య ఇంకా దూరం కొనసాగుతోందని తెలుసుకుని.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఫీ కబుర్లు కార్యక్రమంలో చెప్పినట్టే కార్యకర్తలు, నాయకులు వ్యవహరించాలని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తేడా రాకూడదని తేల్చి చెప్పారు.
ఏం చెప్పారు.. ?
ఇతర కార్యక్రమాల్లో చెబుతున్నట్టే.. కాఫీ కబుర్లు కార్యక్రమంలోనూ.. నాయకులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవిల్లో కూటమి పార్టీల మధ్య సఖ్యత, కలివిడి గా ముందుకు సాగడాన్ని.. వచ్చే 15 ఏళ్లు పార్టీ అధికారంలో ఉండాలంటే.. చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా చెప్పారు. చంద్రబాబు సైతం.. ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో కూడా దిశానిర్దేశం చేశారు. అయితే.. కొందరు దీనిని లైట్ తీసుకున్నట్టు పార్టీకి సమాచారం ఉంది. దీనిపై నే లోకేష్ ఫైరయ్యారు. కాఫీ కబుర్లు కావని.. భవిష్యత్తు వ్యూహాలని చెప్పారు.
