Begin typing your search above and press return to search.

టీడీపీకి వింత అనుభవాలు

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీగా అంతా చెబుతారు. అధినాయకత్వం ఒక మాట అన్నది అంటే దానికి టాప్ టూ బాటమ్ అంతా కట్టుబడి ఉంటారు.

By:  Tupaki Desk   |   18 April 2025 3:00 PM IST
టీడీపీకి వింత అనుభవాలు
X

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీగా అంతా చెబుతారు. అధినాయకత్వం ఒక మాట అన్నది అంటే దానికి టాప్ టూ బాటమ్ అంతా కట్టుబడి ఉంటారు. ఇక తెలుగుదేశం పాలన అంటే ఒక పద్ధతిలో సాగుతుంది. ప్రతీ అడుగులో బాబు మార్క్ కనిపిస్తుంది. కానీ ఈసారి అలా కనిపించడం లేదు అని అంటున్నారు. 2024 లో తొలిసారిగా రెండు పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చింది. అవి కూడా కీలకమైన శాఖలు.

ఇక ఏపీలో పది నెలల కూటమి పాలన పూర్తి అయింది. అయినా కానీ ప్రభావవంతమైన స్థాయిలో పాలన సాగడం లేదని అంటున్నారు. ఇక చంద్రబాబు నాలుగున్నర దశాబ్దాల విశేష అనుభవం ఉన్న వారు ముఖ్యమంత్రిగా ఉంటే జనసేన అధినేతగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఈ ఇద్దరికీ ప్రభుత్వంలో సమాన భాగస్వామ్యం ఉండేలాగానే టీడీపీ పెద్దలు చూసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కూటమిలో జనసేన అధినాయకుడు తీరు టీడీపీకి అంతు పట్టకుండా ఉందని అంటున్నారు. ఆయన కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసు. కానీ అదే సమయంలో ఆయన కొన్ని సార్లు కలివిడిగా ఉండటం లేదని మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.

ఆయన మనసులో ఏదైనా అసంతృప్తి ఉందా అన్నది కూడా కూటమి పెద్దలకు అర్థం కావడం లేదుట. పవన్ అయితే బాహాటంగా అనేకసార్లు చంద్రబాబు మరో పదిహేనేళ్ళ పాటు ఏపీకి సీఎం గా ఉండాలని కోరుకున్నారు. మరి అంతలా మద్దతు ఇచ్చిన వారు అంతలోనే సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

కొన్ని సార్లు కలుగచేసుకుని అనేక కీలక మంత్రిత్వ శాఖల మీద తన అభిప్రాయాన్ని చెబుతారు. మరి కొన్నిసార్లు అయితే పూరిగా మౌన ముద్ర దాలుస్తారు. దీంతో ఆయన ధోరణి అయితే టీడీపీ పెద్దలకు తెలియకుండా ఉందని అంటున్నారు. పవన్ ని మిత్రుడిగానే టీడీపీ చూస్తోంది. కానీ అదే సమయంలో ఆయన బీజేపీకి అత్యంత సన్నిహిత మిత్రుడుగా మారారు అన్న అనుమానాలూ ఉన్నాయి.

ఇంకో వైపు చూస్తే బీజేపీ తీరు కూడా ఇబ్బందికరంగానే ఉంది అని అంటున్నారు. బీజేపీ కీలక నేతలు కొందరు మా వల్లనే ఏపీలో కూటమికి అధికారం వచ్చింది అని అంటున్నారు. మేము లేకపోతే గెలుపు ఉండేది కాదు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్న్నారు. ఇక చంద్రబాబుని టీడీపీ అధినాయకత్వాన్ని ఘాటుగా విమర్శించి వ్యతిరేకించిన వారికి కోరి మరీ నామినేటెడ్ పదవులు వస్తున్నాయి. వాటిని అలా టీడీపీ ఇవ్వాల్సి వస్తోంది.

ఇక రాజ్యసభ సీట్లకు ఖాళీలు ఏర్పడితే వాటిని కూడా బీజేపీ అధినాయకత్వం తన పలుకుబడితో తమ ఖాతాలో వేసుకుంటోంది. ఏపీకి బీజేపీ వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనాలు కేంద్రం నుంచి ఎంత మేరకు వస్తున్నాయో తెలియదు కానీ ఏపీలో కూటమి పెద్దల మీద ప్రభుత్వం మీద తనదైన నియంత్రణను మాత్రం చేస్తోంది అని అంటున్నారు.

వక్ఫ్ సవరణ బిల్లు అన్నది బీజేపీ ఒత్తిడి మేరకే టీడీపీ అంగీకరించి ఓటు చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దాని వల్ల ఇబ్బందులు భవిష్యత్తులో టీడీపీకే తప్ప బీజేపీకి లేవు, జనసేనకూ లేవని అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం విషయంలో కానీ అభివృద్ధి సంక్షేమం విషయంలో కానీ టీడీపీ పడుతున్న ఆరాటం కానీ తపన కానీ మిగిలిన వారు అంతగా తీసుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

ఈ విధంగా చూస్తే టీడీపీకి పూర్తి వెసులుబాటు లేకుండా ఉంది. అదే సమయంలో క్రెడిట్ వస్తే అందరిదీ అవుతోంది. ఇబ్బందులు వస్తే టీడీపీకే పరిమితం అవుతున్నాయి. ఇక టీడీపీలో పదవుల విషయంలో ఎంతో మంది నేతలు ఆశలు పెట్టుకున్నా వారికి ఈ పొత్తుల వల్ల దక్కడం లేదని అంటున్నారు. ఇవన్నీ చూసిన వారు టీడీపీ టోటల్ పొలిటికల్ హిస్టరీలో ఇది గతంలో ఎన్నడూ చూడని వింత అనుభవమేనని అంటున్నారు. ఇంకా నాలుగేళ్ళకు పైగా కూటమి ప్రభుత్వం ఉంది. మిత్రుల సహకారంతోనే ముందుకు అడుగులు వేయాల్సింది ఉంది. మరి ఆ ముచ్చట ఎలా సాగుతుందో అన్నది అంతా ఆలోచిస్తున్నారు.