Begin typing your search above and press return to search.

మహానాడు నుంచే 'సూపర్ సిక్స్'.. కార్యకర్తలకు మాత్రమేనట..

సూపర్ సిక్స్ అనగానే గత ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలే గుర్తుకువస్తాయి.

By:  Tupaki Desk   |   25 May 2025 4:26 PM IST
మహానాడు నుంచే సూపర్ సిక్స్.. కార్యకర్తలకు మాత్రమేనట..
X

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పెద్ద పండుగ మహానాడు నుంచి సూపర్ సిక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కేవలం తన పార్టీ కార్యకర్తలకే పరిమితం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ హామీలు కారణమయ్యాయని భావిస్తున్నారు. ఆ అధికారం శాశ్వతం అవ్వాలంటే టీడీపీ కార్యకర్తలకు మేలు జరిగేలా ‘సూపర్ సిక్స్’ ఉండాలని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన కార్యకర్తల కోసమే ప్రత్యేక కార్యక్రమం రూపొందించడం విశేషంగా చెబుతున్నారు.

సూపర్ సిక్స్ అనగానే గత ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలే గుర్తుకువస్తాయి. ఇందులో ప్రధానంగా దీపం-2 పథకం కింద సబ్సిడీ గ్యాస్ సిలండర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా మిగిలిన హామీలు అమలు చేయాల్సివుంది. ప్రతిపక్ష నేత జగన్ కూడా ఎప్పటికప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని, ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సూపర్ సిక్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు.

అయితే జగన్ విమర్శలను పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నాదని చెబుతూ, హామీల అమలుకు కొంత సమయం కావాలని ఏడాదిగా చెబుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 12న రెండు కీలక హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. వాటిలో ఒకటి తల్లికి వందనం కాగా, మరొకటి అన్నదాతా సుఖీభవ. అంతేకాకుండా మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుపై త్వరలోనే విధాన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో తాను అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ హామీలును ఒకేసారి అమలు చేయాలేని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన పార్టీ కార్యకర్తల కోసం ‘సూపర్ సిక్స్’ తక్షణం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కార్యకర్తలకు మాత్రమే సూపర్ సిక్స్ అమలు చేసి మిగిలిన వారిని విస్మరిస్తారా? అని ప్రశ్న తలెత్తుతోంది. అయితే టీడీపీ వివరణ చూస్తే, చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ సూపర్ సిక్స్ పై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవని అంటున్నారు.

ప్రభుత్వం తరపున ప్రజలు అందరికీ సూపర్ సిక్స్ అమలు చేస్తామని భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తల కోసం మరో ఆరు స్కీములు రెడీ చేశారు. వాటికి కూడా సూపర్ సిక్స్ అని పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆ ఆరు స్కీముల ద్వారా కార్యకర్తల సంక్షేమం చూస్తారని అంటున్నారు. టీడీపీ కార్యకర్తల కోసం రూపొందించిన సూపర్ సిక్స్ లో మొదటిది..‘నా తెలుగు కుటుంబం’ కాగా, 2. స్త్రీ శక్తి, 3. సోషల్ రీ ఇంజనీరింగ్, 4.యువగళం, 5. అన్నదాతకు అండ, 6.కార్యకర్తే అధినేత.

మహానాడు వేదికగా కార్యకర్తల కోసం ఈ సూపర్ సిక్స్ స్కీములును అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ. ఇప్పుడు మరింత మేలు చేసేలా ఈ ఆరు నిర్ణయాలు తీసుకున్నారు. ‘నా తెలుగు కుటుంబం’ అనే తొలి ప్రాధాన్యం ద్వారా టీడీపీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా ఆయా రంగాల్లో నెంబర్ -1 గా రాణించేలా శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా మహిళా కార్యకర్తల కోసం స్త్రీ శక్తి, యువత కోసం యువగళం కింద చేయూత అందించనున్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా పార్టీలో అన్నివర్గాలు, కులాల వారికి న్యాయం జరిగేలా చూస్తారు.

అందరికీ పదవుల్లో ప్రాధాన్యమిస్తారు. అదేవిధంగా పార్టీకి తొలినుంచి వెన్నుదన్నుగా నిలిచిన రైతులకు సాంకేతిక సహకారం అందిస్తారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ లో చివరిదశైన కార్యకర్తే అధినేత ద్వారా కార్యకర్తలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. సీనియర్లను పక్కనపెట్టి యువతను ప్రోత్సహించడం ద్వారా కొత్తరక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్నారు. కార్యకర్తల కోసం ప్రవేశపెట్టనున్న ఈ సూపర్ సిక్స్ ద్వారా అధికారం శాశ్వతం చేసుకోవాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది.