బాబు బాటలోనే లోకేష్.. మ్యాటర్ ఏంటంటే... !
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో ఒక చర్చ ఉంది.
By: Garuda Media | 15 May 2026 7:00 PM ISTప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో ఒక చర్చ ఉంది. నాయకుల విషయంలో చంద్రబాబు సంతృప్తి చెందడం అనేది చాలా కష్టమైన విషయం అనే భావన నాయకులు ఆది నుంచి వినిపిస్తున్నారు. తాము ఎంత పని చేసినప్పటికీ చంద్రబాబు అంత త్వరగా సంతృప్తి చెందరని, మరింత కష్టపడితే తప్ప మార్పులు వేయరని నాయకులు తరచుగా చెబుతూ ఉంటారు. గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అనేకమంది నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చంద్రబాబును మెప్పించడం అంత తేలిక కాదని, తాము 100% కష్టపడితే చంద్రబాబు దగ్గర 10% కూడా మార్కులు రావని చాలామంది నాయకులు చెబుతూ ఉంటారు. పార్టీ విధానాలను గమనిస్తే ఇదే విషయం తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తను స్వయంగా తెలుసుకోవడంతో పాటు నాయకులు చెబుతున్న విషయాలను బేరీజు వేసుకొని చంద్రబాబు పోల్చి చూసుకుంటారు. ఆ తర్వాత నాయకుల విషయంలో నిర్ణయానికి వస్తారు. ఇది నాయకులకు ఒక రకంగా ఇబ్బందికర అంశమే అయినప్పటికీ పార్టీని డెవలప్ చేసే విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు పట్టే అవకాశం లేదు.
అయితే ఇప్పుడు పార్టీలో యువతరం వచ్చింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అంటే తాము పడుతున్న కష్టానికి మంచి మార్కులు వస్తాయి అని వారు అంచనా వేస్తున్నారు. కానీ, నారా లోకేష్ వ్యవహారాన్ని గమనించినప్పటికీ నాయకుల విషయంలో ఈ తరహా పరిస్థితి ఉండడం లేదని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగానే నారా లోకేష్ కూడా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ.
అంత తేలికగా నాయకులకు మార్కులు వేసే పరిస్థితి నారా లోకేష్ దగ్గర కూడా లేదని ఎంతో కష్టపడితే తప్ప ఆయన దగ్గర మార్పులు సంపాదించడం చాలా కష్టమని అంటున్నారు. రాయలసీమకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల నారా లోకేష్ ను కలిశారు. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అదేవిధంగా ప్రజల సంతృప్తి అంశాలపై వారు ఒక నివేదికను అందజేశారు. కానీ ఇదే సమయంలో ఆయన వెంటనే వారిని పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది.. మధ్యాహ్నం భోజనం పై వస్తున్న వార్తలు మీ దృష్టికి వచ్చాయా.. వాటి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని ప్రశ్నలు సంధించారు.
దీంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాము ఒక కోణంలో ఆలోచిస్తే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరింత లోతుగా లోకేష్ ఆలోచించడంతో వారంతా మౌనంగా ఉండిపోయారు. కష్టపడే విషయంలో అన్ని కోణాలను పరిశీలనలోకి తీసుకుంటామని, ఏ చిన్న తేడా వచ్చిన నాయకులకు మార్కులు వేసేది లేదని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. అంటే ఒక రకంగా చంద్రబాబు బాటలోనే నారా లోకేష్ కూడా పయనిస్తున్నారనే విషయం నాయకులకు స్పష్టమైనది. దీనిని బట్టి నాయకులు తమ పని విధానాన్ని తమ ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరువ అయ్యే విధానాన్ని కూడా మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం స్పష్టం అవుతోంది.
