సడన్ ఛేంజ్.. ఒకేసారి టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు, లోకేశ్!
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత, మంత్రి లోకేష్ లో అనూహ్య మార్పు వచ్చింది.
By: Tupaki Desk | 13 Aug 2025 3:23 PM ISTటీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత, మంత్రి లోకేష్ లో అనూహ్య మార్పు వచ్చింది. గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు క్రమంగా ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. మంత్రి నారా లోకేష్ సైతం ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని టీడీపీ కేడరులో అసమ్మతి అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ విషయంపై అధినేతకు పలు మార్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఆకస్మికంగా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో చర్చించారు. అంతేకాకుండా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమగ్ర సమీక్షకు నిర్ణయించారు. దీనికి మంత్రి లోకేశ్ కూడా హాజరుకావాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ.. 14 నెలలుగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే ఈ కార్యక్రమాలపై పెద్దగా ప్రచారం జరగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదికలు వచ్చాయని అంటున్నారు. దీనికి కారణం కార్యకర్తల్లో నిస్తేజం అలుముకోవడమే అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమకు ప్రోత్సాహం కరువు అవుతూందని టీడీపీ కేడరు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నామినేడెట్ పదవులు భర్తీ కాకపోవడం ఈ అసంతృప్తికి కారణంగా విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఎక్కువ ప్రభావం చూపే నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీలో జాప్యం చేస్తున్నారని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ఎమ్మెల్యేలే కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా మహనాడు ముగిసి మూడు నెలలు అవుతున్నా, పార్టీ పదవులను భర్తీ చేయలేదు. మహానాడు సమయంలో మంత్రి లోకేశ్ ను పార్టీ వర్కింగు ప్రెసిడెంటుగా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రక్రియ కూడా ముందుకు కదలలేదు. దీనికి నియోజకవర్గ స్థాయిలో జరగాల్సిన క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నియామకాల నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడం ఓ కారణంగా చెబుతున్నారు.
చంద్రబాబు అధికార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతుండటం, ఆయనకు తోడుగా లోకేశ్ కూడా బిజీ అయిపోవడం వల్ల తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ పెద్దలు అధిష్టానాన్ని అప్రమత్తం చేయడంతో పార్టీపై దృష్టి పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అందుకే హడావుడిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాగా, కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిర్వహించే సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ కనిపిస్తోంది.
