Begin typing your search above and press return to search.

టీడీపీ టాక్ : సీనియర్లలో ఆశలు పూస్తున్నాయా ?

ఇక తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అని వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   12 July 2025 7:00 AM IST
టీడీపీ టాక్ : సీనియర్లలో ఆశలు పూస్తున్నాయా ?
X

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగున్నర దశాబ్దాలు సహజంగానే ఆ పార్టీలో సీనియర్లు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉంటారు. అయితే కాలానుగుణంగా మార్పులు వస్తాయి అలా టీడీపీలోనూ మార్పులు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే 2024 ఎన్నికల్లో ఎక్కువగా జూనియర్లకు పెద్ద పీట వేశారు. అదే విధంగా మంత్రివర్గంలోనూ సింహ భాగం చోటు కల్పించారు. ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలు వారికే ఎక్కువగా ఇచ్చారు.

అయితే ఏడాది పైగా కాలం గడచింది. జూనియర్లలో చాలా మంది తమ పనితీరుతో ప్రభుత్వం పెద్దలను ఆకట్టుకోలేక పోతున్నారు అని ప్రచారం సాగుతోంది ఇక తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు అని వార్తలు వచ్చాయి. దాంతో పాటుగా కొత్తవారు వస్తారు అని ఒక భారీ సంకేతం ఇచ్చారని అంటున్నారు.

ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో టీడీపీలోని సీనియర్లలో ఆశలు పూస్తున్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రా నుంచి మొదలుపెడితే రాయలసీమ దాకా సీనియర్లు అనేక మంది మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుని బెర్త్ దొరకక కాస్తా మౌనంగానే ఉంటూ వస్తున్నారు. జిల్లాలను శాసించేవారు కాస్తా కేవలం తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతూ వస్తున్నారు అంతే కాదు వైసీపీ మీద విమర్శల విషయం కూడా మంత్రుల బాధ్యత అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.

మరో వైపు చూస్తే సీనియర్ల విషయంలో అధినాయకత్వం అయితే బాగానే ఉంటోంది. వారిని పక్కన పెట్టినా పార్టీ కోసమే కొత్త నీరు అన్నట్లుగానే చెబుతూ వస్తోంది. అయితే ఏడాది పాటు సాగిన ప్రభుత్వంలో పెద్దగా అనుభవం కలిగిన వారు లేకపోవడంతో ధాటీగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోతోంది అని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే జగన్ ఇపుడిపుడే జనంలోకి వెళ్తున్నారు. ఆయన కూటమి మీద విమర్శలు ఎక్కు పెడుతున్నారు.

రానున్న కాలంలో ఈ జోరు మరింత ఎక్కువగా పెంచవచ్చు. అంతే కాదు కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతో కొంత పెరుగుతుందే తప్ప తగ్గేది ఉండదు. ఈ నేపథ్యంలో వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ చేసే మంచిని జనాలకు చెబుతూ వైసీపీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టగల వారు కావాల్సి ఉందని అంటున్నారు. గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో దిట్టలుగా అనేక మంది ఉండేవారు.

వారు సబ్జెక్ట్ లో ఎక్స్ పెర్టులుగా ఉండేవారు. విపక్షం నుంచి ఒక విమర్శ రాగానే అన్ని లెక్కలతో అంకెలతో సహా గటగటా మీడియా ముందు చెప్పేసి అక్కడికి ఆ విమర్శకు చెక్ పెట్టేసేవారు. అంతే కాదు రాజకీయంగా చాలా మంది దూకుడుగా ఉండేవారు. ఇపుడు మళ్ళీ అలాంటి వారి అవసరం అయితే టీడీపీకి పడుతోంది అని అంటున్నారు. దాంతో మంత్రివర్గంలో మార్పులు జరిగితే కనుక కచ్చితంగా సీనియర్లకు ధాటీగా ఉండేవారికి కచ్చితంగా చోటు దక్కుతుందని ప్రచారం సాగుతోంది.

దాంతో సీనియర్లలో ఇపుడు హుషార్ కనిపిస్తోంది. తమకు అమాత్య కిరీటలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని చాలా మంది భావిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీకి ఇది సెమీ ఫైనల్స్ అని అంటున్నారు. 2029లో కూడా వైసీపీ తన బలాలను కూడదీసుకుని పోటీ పడనుంది.

అపుడు కూడా వైసీపీని ఓడించి అధికారం చేపడితేనే టీడీపీ విజయం సంపూర్ణం అయినట్లు అంటున్నారు. అందుకే ప్రయోగాలకు స్వస్తి పలికి టీడీపీ వైసీపీని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు సీనియర్లను రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో అదే కనుక జరిగితే కొత్తగా పాత ముఖాలను కేబినెట్ లో చూసేది ఎవరెవరు అన్న చర్చ అయితే అపుడే స్టార్ట్ అయిపోయింది.