Begin typing your search above and press return to search.

విజయవాడ వెస్ట్ టీడీపీ ఇంచార్జ్‌గా బుద్దా..!

విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా బుద్దా వెంకన్న.? అవును ఈ చర్చ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

By:  Tupaki Political Desk   |   8 July 2026 3:00 PM IST
విజయవాడ వెస్ట్ టీడీపీ ఇంచార్జ్‌గా బుద్దా..!
X

విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా బుద్దా వెంకన్న.? అవును ఈ చర్చ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచిన సీటు ఇది. పైగా విజయవాడ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం. సైకిల్ పార్టీకి కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ సెగ్మెంట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది టీడీపీ అధిష్టానం. ఇప్పటివరకు 13 సార్లు ఈ సీటుకు ఎన్నికలు జరిగితే..1983లో బీఎస్ జయరాజ్‌ ఈ సీటు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్..లేకపోతే కమ్యూనిస్టులు ..రెండుసార్లు వైసీపీ..మొన్నటిసారి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గెలిచారు. అలాంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం..టీడీపీకి ప్రెస్టీజియస్‌గా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎటూ తేల్చుకోలేక టీడీపీ హైకమాండ్‌..ఓవరు టు బీజేపీ అనేసింది. అప్పుడు పార్టీ టికెట్ ఆశించిన నేతలంతా ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు..స్థానికంగా తమకంటూ ఓ వర్గం క్రియేట్ చేసుకున్న లీడర్లు కావడంతో..ఎవరి టికెట్ ఇచ్చినా మిగతావారు ఫీల్ అవుతారని..కూటమి పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి వదిలేసింది టీడీపీ.

విజయవాడ వెస్ట్‌కు కొత్త ఇంచార్జ్ ఎందుకు.?

టీడీపీ పవర్‌లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా..పశ్చిమ నియోజకవర్గం ఆ పార్టీకి తలనొప్పుగానే ఉంటోంది. గ్రూప్ పాలిటిక్స్‌..ఏకంగా ఐదారుగురు ఎమ్మెల్యే స్థాయి నేతలుండటం సమస్యగా మారింది. 2024 ఎన్నికలు అయిపోయాక కూడా విజయవాడ వెస్ట్‌కు ఇంచార్జ్‌ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసింది. ఏకంగా ఐదారుగురు నేతలు రేసులో ఉండటం..ఇంకో నామినేటెడ్‌ పదవుల చిచ్చుతో..లోకల్ లీడర్లకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంది. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్నికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ టీడీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఎంపీ కేశినేని చిన్ని రెండేళ్ల పాటు అక్కడ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. ఇప్పుడు ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నానని..ఎవరినైనా ఇంచార్జ్‌గా నియమించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. దీంతో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్‌కు ఇంచార్జ్‌ను నియమించే ప్రాసెస్‌ను స్పీడప్ చేసింది టీడీపీ అధిష్టానం.

ఇంచార్జ్‌గా బుద్దా వెంకన్ననే ఎందుకు.?

విజయవాడ పశ్చిమ టీడీపీ ఇంచార్జ్ పదవి ఆశిస్తున్న నేతలు..అధిష్టానం దృష్టిలో పడేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, నాగూల్ మీరా, ఎమ్మెస్ బేగ్, డూండి రాకేష్, ఫతావుల్లా ఇంచార్జ్‌ రేసులో ఉండగా..పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో క్యాడర్, లీడర్ల మద్దతు బుద్దా వెంకన్నకే ఉందంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడ సెంట్రిక్‌గా దూకుడుగా పనిచేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జరిపిన ఉద్యమం ఆయనకు అప్పట్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం కూడా బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అలాంటి బుద్దా వెంకన్నవైపే క్యాడర్‌ మొగ్గు చూపుతోందని చెబుతున్నారు. గతంలో విజయవాడ పశ్చిమలో గతంలో ఒకసారి పోటీ చేసి ఓడారు బుద్దా వెంకన్న. మొత్తం 22 డివిజన్ అధ్యక్షులకుగానూ 17 మంది బుద్దా పేరును సూచించినట్టు తెలుస్తోంది. ఎక్కువ శాతం మంది బుద్దా వెంకన్న వైపు మొగ్గుచూపుడంతో విజయవాడ పశ్చిమ ఇంచార్జ్‌గా బుద్దా వెంకన్న పేరును అధికారికంగా ప్రకటించడమే లేటు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.