రేసు నుంచి తప్పుకున్న టీడీపీ.. చంద్రబాబు వ్యూహమేంటి?
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తప్పుచేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి వదిలేయడంపై టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 17 April 2025 9:52 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తప్పుచేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి వదిలేయడంపై టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి రాజకీయంగా రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యమిచ్చామని, ఇప్పుడు అదనంగా రాజ్యసభ ఇవ్వడం ద్వారా రాజకీయంగా టీడీపీకి నష్టమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బీజేపీకి ఓ రాజ్యసభ స్థానం ఇచ్చినందున మళ్లీ ఆ పార్టీకే అవకాశం ఇవ్వడం వల్ల తాము నష్టపోవాల్సివస్తోందని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. అధినేత తీరుపై అసంతృప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.
గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోయింది. 2019 ఎన్నికల సమయంలో పార్టీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉండేవారు. వీరిలో నలుగురు 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీంతో గత ఏడాది మార్చి వరకు కేవలం ఒకే ఒక్క రాజ్యసభ సభ్యుడితో టీడీపీ నెట్టుకొచ్చింది. ఇక 2019-24 మధ్య సొంతంగా రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే బలం లేకపోవడంతో గత ఏడాది జూన్ లో ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. అయితే ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వచ్చే ఐదేళ్ల వరకు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే అన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో మూడు స్థానాలకు ఒకదాన్ని బీజేపీకి కేటాయించింది. ఈ సమయంలో మరో మిత్రపక్షం జనసేన రాజ్యసభ స్థానాన్ని ఆశించినా టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండగా, అది కూడా బీజేపీకి కేటాయించాలని నిర్ణయించడం ఆత్మహత్యాశదృష్యమని అంటున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యమిస్తామని ముందే హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీలకు నామినేటెడ్, రాజ్యసభ, శాసనమండలి స్థానాలకు అవకాశం ఇచ్చినందున మళ్లీ మరోసీటు త్యాగం చేయడం ఎందుకని ప్రశ్న వస్తోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉండగా, బీజేపీకి వదిలేయడంపై పార్టీలో రకరకాల చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి ఓ ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ స్థానాన్ని ఇచ్చామని, భవిష్యత్ లోనూ అవకాశాలు ఇవ్వాల్సివున్నందున ఇప్పుడు ఖాళీ అయిన ఏకైక స్థానాన్ని టీడీపీ తీసుకుంటే బాగుండేదని అంటున్నారు.
రాజ్యసభలో సొంతంగా బలం పెంచుకోవాలని ఆశిస్తున్న బీజేపీ.. రాష్ట్రం నుంచి సీటు తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. బయటకి ఎవరూ మాట్లాడలేకపోతున్నా, తమ అధినేత చేసిన పనికి లోలోన మదనపడుతున్నారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కాకపోయినా మరో ఏడాదిలో రాజ్యసభలో పూర్తి మెజార్టీ సంపాదించే అవకాశాలు ఉన్నందున, మనం కొత్తగా త్యాగం చేయడం అవసరమా? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అధినేత మాట ఇచ్చినందున వెనక్కి తీసుకోలేమని, కానీ భవిష్యత్తులో ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు చేయకుండా జాగ్రత్త వహించాలని హితవు పలుకుతున్నారు.
