టీడీపీకి మోడీ గిఫ్ట్.. ఆ పార్టీకి కీలక పదవి..! ఎవరికి దక్కబోతోందంటే..?
ఎన్డీఏ కూటమిలోని బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలకు మరింత ప్రాధాన్యం ఇస్తుంది.
By: Tupaki Desk | 16 Sept 2025 9:00 PM ISTఎన్డీఏ కూటమిలోని బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలకు మరింత ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు దేశం పార్టీకి మరో గవర్నర్ పదవి దక్కబోతోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎప్పటి మాదిరిగానే బీజేపీ మిత్రపక్షాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బిహార్ లో ఎన్నికల వేడి రాజుకుంటుండగా.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో సంకీర్ణ బంధాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కీలక హోదాలను భాగస్వామ్య పార్టీలకు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు కేబినెట్ శాఖలను దక్కించుకున్న టీడీపీకి తాజాగా గవర్నర్ రూపంలో మరో అవకాశం దక్కించుకోబోతోందని తెలుస్తోంది.
ఎన్డీయే భారీ వ్యూహం
సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమించడం వెనుక భారీ వ్యూహామే ఉంది. 2014లో టీడీపీ ఎన్డీఏలో భాగమై ఉన్నప్పుడు గవర్నర్ పదవి హామీ ఇచ్చినా అమలు కాలేదు. కానీ ఈసారి ఆ లోటు పూరించాలన్న ఉద్దేశంతో కేంద్రం ముందడుగు వేసింది. ఇదే తరహాలో మరో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది.
ఆయనకే మరో రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారా..?
ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఆ గవర్నర్ బాధ్యతలు ఎవరికీ దక్కబోతున్నాయి? అనే.. ఆ విషయంలో అశోక్ గజపతి రాజు వైపునకే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపన దశ నుంచే ఉన్నారు. అంకితభావంతో పనిచేసిన నాయకుడు.. వివాదరహితుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్రాంతీయ సంతులనం కూడా ఆయన ఎన్నికనే కోరుకుంటున్నయని కనిపిస్తోంది. రెండోసారి గవర్నర్ పదవి కేటాయింపులో మాత్రం బీసీ లేదంటే ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం.
యనమల, కృష్ణమూర్తి పేర్లు కూడా..
ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తున్నా, ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న సమీకరణ ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వర్గ నేతను గవర్నర్ పదవికి పరిగణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు కూడా ఈ జాబితాలో ఉంది. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలు పెట్టి.. ఆ తర్వాత టీడీపీలో చేరి కీలక హోదాల్లో పని చేశారు. ఆయనకు విస్తృత అనుభవం ఉంది. అయితే ఆయన కుమారుడు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాల నుంచి కృష్ణమూర్తి కొంత వెనుకబడ్డారు. అయినా, ఆయన సీనియారిటీ, సామాజికవర్గ ప్రాతినిధ్యం దృష్ట్యా గవర్నర్ హోదా సాధ్యమేనని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేక దృష్ట
దాదాపు బిహార్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందన్న సంకేతాలలు కనిపిస్తుండడంతో కీలక హోదాల కేటాయింపులపై త్వరలో స్పష్టత రాబోతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి టీడీపీ నాయకులకు జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే ఈ సమీకరణల లక్ష్యం. చివరికి గవర్నర్ పదవి ఎవరి ఖాతాలో పడుతుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
