Begin typing your search above and press return to search.

తమ్ముడు హడావుడి ఎందుకోసం ?

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అన్నది ప్రధానంగా అంతా మాట్లాడుకుంటారు. వర్గ పోరు కానీ సొంత పార్టీలో సౌండ్ చేయడం లాంటి చర్యలను కానీ పెద్దగా ఉపేక్షించేది ఉండదు.

By:  Satya P   |   10 July 2026 9:15 AM IST
తమ్ముడు హడావుడి ఎందుకోసం ?
X

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అన్నది ప్రధానంగా అంతా మాట్లాడుకుంటారు. వర్గ పోరు కానీ సొంత పార్టీలో సౌండ్ చేయడం లాంటి చర్యలను కానీ పెద్దగా ఉపేక్షించేది ఉండదు. అయితే అన్నీ తెలిసిన సీనియర్ తమ్ముడు ఒకరు ఇటీవల కాలంలో చేస్తున్న హడావుడి పార్టీలో పెద్ద ఎత్తున చర్చగా సాగుతోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన కర్రోతు బంగారు రాజు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. పలుకుబడి దండీగా ఉంది. మండల పరిషత్ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయనకు ఎమ్మెల్యే సీటు దక్కాల్సి ఉంది. 2024 లో కూటమి పార్టీలతో పొత్తు వల్ల అనేక సమీకరణల నేపధ్యంలో చాన్స్ జనసేనకు వెళ్ళింది. ఆనాడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని అధినాయకత్వం ప్రామిస్ చేసింది అని అంటారు. కానీ చివరికి దక్కింది నామినేటెడ్ పదవి అన్న బాధ అయితే ఉందిట.

కేంద్ర మంత్రినే నిలువరించి :

ఇక బంగార్రాజు గురించి ఎందుకు ఇపుడు అంతగా చర్చ అంటే తాజాగా భోగాపురం విమానాశ్రయం పనులు పూర్తి అయిన సందర్భంగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫైనల్ గా సమీక్షను చేశారు కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం బంగార్రాజుకు పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన స్థానికులకు ఉద్యోగాల సంగతేంటి అని కేంద్ర మంత్రినే నిలదీశారు. మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు కానీ మేము జనాలకు జవాబు చెప్పుకోవాలి అంటూ బంగార్రాజు మాట్లాడిన తీరు అక్కడ ఉన్న వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నారు. సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రిని అదే పార్టీకి చెందిన స్థానిక నేత ఈ విధంగా నిలదీయడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

గొంతు పెంచుతున్న వైనం :

ఇక విజానగరం జిల్లాలో జరిగే డీఆర్సీ సమావేశంలో కూడా ఈ విధంగానే బంగార్రాజు గొంతు పెంచి ప్రజా సమస్యల పేరుతో అధికారులను గట్టిగానే నిలదీయడం చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు నెల్లిమర్ల పంచాయతీ సమావేశంలో కూడా తన అధికార హవాను ఆయన గట్టిగానే చూపించారు అని అంటున్నారు. దీంతో పాటు ఆయన నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవితో సమాంతరంగా అధికార దర్పం చాటుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంటుంది. దాంతో ఇక్కడ కూటమిలో వర్గ పోరు సాగుతోంది అని అంటున్నారు.

ఎందుకిలా అంటే మరి :

బంగార్రాజుకు జనంలో పలుకుబడి ఉంది. ఆయన స్థానికంగా గట్టి నాయకుడే. స్థానికుల డిమాండ్లను అధికారుల మంత్రుల ముందు పెట్టి చేయించుకుంటారు అని అంటున్నారు. కానీ సొంత పార్టీ నేతలను కేంద్ర రాష్ట్ర మంత్రులను ఇరకాటంలో పెట్టే విధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం చర్చనీయాంశం అవుతోంది. తాను ఎమ్మెల్యే స్థాయి నేతను అని చాటుకునేందుకు తన ఇమేజ్ ని పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారు అని సొంత పార్టీలో గుసగుసలు పోతున్నారు. తనకు ఇలాగైతేనే మంచి గుర్తింపు లభిస్తుందని తన హవా ఎంటో పెద్దలకు తెలుస్తుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఈ విధంగా అతి చేస్తే రేపటి రోజున ఇబ్బందులు కూడా వస్తాయని అంటున్నారు. పార్టీ అన్నింటి కన్నా క్రమశిక్షణకే పెద్ద పీట వేస్తుందని కూడా గుర్తు చేస్తున్నారు పార్టీ నేతలు. మరి బంగార్రాజు 2029 ఎమ్మెల్యే కావాలనుకుంటే ఈ హడావుడి అవసరమా అన్న ప్రశ్నలు అయితే పసుపు పార్టీలో వస్తున్నాయి.