దేశానికి రాజ్యాంగంలా.. టీడీపీకి 'ఆరు' శాసనాలు!: లోకేష్
ఈ సమయంలోనే ఆయన ఆరు శాసనాలను ప్రకటించారు. దేశానికి రాజ్యాంగం ఎంతో.. టీడీపీకి ఆరు శాసనాలు కూడా అంతేనని వెల్లడించారు.
By: Tupaki Desk | 28 May 2025 6:00 AM ISTటీడీపీ అభ్యున్నతికి.. భవిష్యత్తుకు ఉప యోగపడేలా.. ప్రతి ఒక్కరూ పాటించేలా.. అమలు చేసేలా.. ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కడపలో జరుగుతున్న మహానాడులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రసంగించిన అనంతరం.. నారా లోకేష్ కూడా సుమారు 36 నిమిషాలు ప్రసంగించారు. ఈ సమయంలోనే ఆయన ఆరు శాసనాలను ప్రకటించారు. దేశానికి రాజ్యాంగం ఎంతో.. టీడీపీకి ఆరు శాసనాలు కూడా అంతేనని వెల్లడించారు.
ఇవీ.. ఆ ఆరు..!
1) తెలుగు జాతి- విశ్వ ఖ్యాతి: తెలుగు ప్రజలుఎక్కడున్నా.. వారి మేలు కోరుకునే పార్టీ టీడీపీనేనని లోకేష్ అన్నారు. తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా.. తెలుగువారు స్పందిస్తున్నారని చెప్పారు. అందుకే.. తెలుగు జాతి.. విశ్వఖ్యాతి సృష్టించే క్రమంలో పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుంది. వారి తరఫున పనిచేస్తుంది.
2) పేదల సేవలో: టీడీపీ అంటే.. పేదల పార్టీ అని లోకేష్ అన్నారు. రూ.2 కిలో బియ్యం నుంచి అనేక పథకాలు అమలు చేస్తున్న పార్టీ కూడా ఇదేనని చెప్పారు. వచ్చే నెలలో మాతృవందనం.. ఆగస్టు నుంచి ఆర్టీసీ ఫ్రీ బస్సు సేవలను అందిస్తున్నామన్నారు.
3) సోషల్ రీ ఇంజనీరింగ్: సమాజంలోని అట్టుడుగు వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ టీడీపీనేనని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పార్టీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఇలా.. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
4) స్త్రీ శక్తి: మహిళలకు టీడీపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న హోం శాఖ మహిళ నడుపుతున్నారని చెప్పారు. గతంలో వైసీపీ మంత్రి ఒకరు నాకు చీర, గాజులు పంపిస్తామన్నారు. నేను పంపించమని చెప్పా. మా అక్క, అమ్మలకు వాటిని ఇచ్చి కాళ్లు మొక్కుతానన్నా.. అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ``గాజులు వేసుకున్నానా?``, చీరకట్టుకున్నానా? ఆడపిల్లలా ఏడుస్తున్నావ్! వంటి పదాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు.
5) అన్నదాతకు అండగా: రైతు లేనిదే రాజ్యం లేదన్నది నిజమని.. అందుకే రైతుల సేవలో పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఇన్ పుట్ సబ్సిడీని పంపిణీ చేయడం టీడీపీనే ప్రారంభించిందన్నారు.
6) కార్యకర్తే అధినేత: పార్టీకి కార్యకర్తే అధినేత అని నారా లోకేష్ అన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. భవిష్యత్తులోనూ అమలు చేస్తామని చెప్పారు.
