Begin typing your search above and press return to search.

నల్లమిల్లికి డబుల్ ధమాకా.. బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ బంపర్ ఆఫర్

అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జుల నియామకంలో టీడీపీ తీసుకున్న ఓ నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది.

By:  Tupaki Political Desk   |   19 July 2026 1:00 AM IST
నల్లమిల్లికి డబుల్ ధమాకా.. బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ బంపర్ ఆఫర్
X

అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జుల నియామకంలో టీడీపీ తీసుకున్న ఓ నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కేడర్ కు దిశానిర్దేశం చేసేందుకు టీడీపీ అధిష్టానం ఇటీవల ఇంచార్జులను నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఇచ్చిన సీట్లతోపాటు ప్రతిపక్షం గెలిచిన 11 చోట్ల ఇంచార్జులకు బాధ్యతలు అప్పగించిన టీడీపీ తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అనపర్తి నియోజకవర్గానికి ఆయన కుమారుడికే బాధ్యతలు అప్పగించింది. పార్టీలో ఒకరిద్దరు నాయకులు ఇంచార్జి పదవులను ఆశించినప్పటికీ టీడీపీ హైకమాండ్ మాత్రం బీజేపీ ఎమ్మెల్యే కుటుంబానికి పదవి అప్పగించడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డికి అనపర్తి బాధ్యతలు అప్పగించిన టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని అంటున్నారు. ఈ నియామకం ద్వారా కూటమిలో తలనొప్పులు లేకుండా చూసుకోవడమే కాకుండా, భవిష్యత్తులో నల్లమిల్లి కుటుంబం చేయి దాటిపోకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లికి గట్టి పట్టువుండగా, ఆయన తొలి నుంచి టీడీపీలో ఉండటం, గత ఎన్నికల్లో హైకమాండ్ సూచనల మేరకు బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ నల్లమిల్లి స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తే లేనిపోని వివాదాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే ఆలోచనతో ఎమ్మెల్యే కుమారుడికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

ఎమ్మెల్యే కుమారుడికి ఇంచార్జి పదవి ఇవ్వడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నియామకం వల్ల నల్లమిల్లి వారసుడికి లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. నిజానికి కూటమిలో పలుచోట్ల టీడీపీ మిత్రపక్షాలకు ఇంచార్జుల మూలంగా తలనొప్పులు వస్తున్నాయని అంటున్నారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటు టీడీపీ ఇంచార్జులు ఓవర్ టేక్ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల మిత్ర బేధాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. మిత్రపక్షాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జుల మధ్య సమన్వయం సాధించడం కూడా తలకు మించిన భారం అవుతోందని అంటున్నారు.

ఈ పరిస్థితులను గమనించే టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదనే గట్టి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిద్వారా ఎమ్మెల్యే నల్లమిల్లికి డబుల్ ధమాకా లభించిందని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్న రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో రెండు పార్టీలను చేతిలో పెట్టుకోవడం కూడా రాజకీయంగా పట్టు పెంచుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సాంకేతికంగా బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన మనసు అంతా టీడీపీతోనే ఉండటం వల్ల ఆ పార్టీ కూడా ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేయకుండా నల్లమిల్లి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చిందని చెబుతున్నారు.