అనంత కాక: అమిలినేని వర్సెస్ ఉన్నం..!
తాజాగా కల్యాణ దుర్గం నియోజకవర్గం వంతు వచ్చింది. కొన్ని రోజుల కిందట ఇక్కడ నకిలీ స్టాంపుల కుంభకోణం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 1 July 2025 11:00 PM ISTటీడీపీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉన్న జిల్లా అనంతపురం. అయితే.. ఏడాది కాలంగా ఈ జిల్లాలోనే అనేక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. మంత్రి సవితకు వ్యతిరేకంగా పెనుకొండ నేతలు.. గ్రూపు రాజకీయాలు చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఇక, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆదినారా యణరెడ్డి మధ్య ఫ్లైయాష్ వివాదం ఒకదశలో జిల్లాను కుదిపేసింది. తర్వాత.. పుట్టపర్తి ఎమ్మెల్యే, రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి.
ఇలా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనంతపురం జిల్లా వివాదాలకు కేంద్రంగా మారింది. తాజాగా కల్యాణ దుర్గం నియోజకవర్గం వంతు వచ్చింది. కొన్ని రోజుల కిందట ఇక్కడ నకిలీ స్టాంపుల కుంభకోణం వెలుగు చూసింది. ప్రస్తుత ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు.. అమిలినేని సురేంద్రబాబుకు చెందిన సొంత కంపెనీ.. `ఎస్ ఆర్‌సీ` పేరుతో కొనుగోలు చేసిన నకిలీ ఈ స్టాంపుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ -స్టాంపుల విలువ సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో తన కంపెనీపై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే అమిలినేని ఉలిక్కి పడ్డారు.
వెంటనే ఆయన మీడియా మీటింగ్ పెట్టి.. తనపై వైసీపీ నేతలుకుట్ర పన్నారని.. నకిలీ స్టాంపుల కుంభకోణంతో తన వ్యాపారాల ను దెబ్బకొట్టి.. రాజకీయంగా తనను డైల్యూట్ చేయాలని భావిస్తున్నారని సురేంద్ర బాబు ఆరోపించారు. అయితే.. తాజాగా పోలీసులు చేపట్టిన విచారణలో మరో కోణం వెలుగు చూసింది. అసలు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణం వెనుక.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి ఉన్నారని తేల్చారు. త్వరలోనే ఆయనను విచారించనున్నట్టు కూడా చెప్పారు. అంతేకాదు.. దీనివెనుక కుట్ర కోణం ఉందని కూడా ఏఎస్పీ చెప్పడం మరింత సంచలనంగా మారింది. ఇది రుజువైతే.. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కుట్ర చేసినట్టు రుజువవుతుంది.
ఎందుకిలా?
ఇక, ఈ రాజకీయ రగడకు రీజనేంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఉన్నం హనుంత కుమారుడు మారుతి.. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. జిల్లాలోనూ ఆయనకు పేరుంది. దీంతో గత 2024 ఎన్నికల్లో కల్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను ఆయన ఆశించారు. అయితే.. పార్టీ పరంగా చేయించిన ఐవీఆర్ ఎస్ సర్వేల్లో మారుతికి తక్కువ మార్కులు పడ్డాయి. పైగా.. వైసీపీని బలంగా ఎదుర్కొనాలంటే.. ఆర్థికంగా కూడా ఆయన ఇబ్బంది పడతారని గ్రహించిన పార్టీ అధిష్టానం.. అమిలినేని సురేంద్ర బాబుకు అవకాశం ఇచ్చింది.
దీంతో ఉన్నం వర్గం.. పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపట్టింది. అమిలినేనిని ఓడిస్తామని కూడా శపథాలు చేసింది. కానీ, నారా లోకేష్ జోక్యం చేసుకుని అప్పట్లో సర్దిచెప్పారు.కానీ, ఉన్నం వర్సెస్ అమిలినేని వర్గాల మధ్య రాజకీయాలు మాత్రం ఏడాది కాలంగా రగులుతూనే ఉన్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు నకిలీ స్టాంపుల కుంభకోణం కుట్ర జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
