Begin typing your search above and press return to search.

'సేవ్ టీడీపీ' ఆ నియోజకవర్గంలో మళ్లీ అగ్గి రాజుకుంది!

ఈ రోజు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

By:  Tupaki Desk   |   29 Aug 2025 7:00 PM IST
సేవ్ టీడీపీ ఆ నియోజకవర్గంలో మళ్లీ అగ్గి రాజుకుంది!
X

ఏపీలో అధికార కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం పార్టీ కార్యవర్గాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా, పలు చోట్ల వివాదాలు జరుగుతున్నాయి. కార్యకర్తలు ఒకరిని కోరుకుంటే, నేతలు తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించాలని చూడటమే వివాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నాయకత్వాలపై పోరు జరుగుతుండగా, ఈ రోజు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ‘సేవ్ టీడీపీ’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ అగ్గి రాజేశారు.

శింగనమల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బండారు శ్రావణికి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న టు మెన్ కమిటీకి తొలి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో శ్రావణి అభ్యర్థిత్వాన్ని టు మెన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే అధిష్టానం జోక్యంతో శ్రావణి గెలుపు కోసం టు మెన్ కమిటీ పనిచేసినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుక్షణం నుంచి వీరి మధ్య విభేదాలు యథావిధిగా మొదలయ్యాయి. ఎమ్మెల్యే వర్సెస్ టు మెన్ కమిటీ అన్నట్లు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయని అంటున్నారు.

ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం, ఆధిపత్యం ప్రదర్శించే అవకాశంగా వాడుకోవడంతో శింగనమల టీడీపీ రాజకీయాలు నిత్యం కాక మీద ఉంటున్నాయి. తాజాగా బుక్కరాయసముద్రం మండలంలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని ఎమ్మెల్యే శ్రావణి ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంపై టు మెన్ కమిటీ మద్దతుదారులైన టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే శ్రావణి నుంచి టీడీపీని రక్షించాలని కోరుతూ ‘సేవ్ టీడీపీ’ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

గత ఎన్నికలకు ముందు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ సాధించిన బండారు శ్రావణి ప్రతిభావంతురాలిగా అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా, ఈ రెండు చోట్ల యువకులైన నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే శ్రావణితోపాటే ఎమ్మెల్యేగా ఎన్నికైన మడకశిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజు తన నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతుండగా, శ్రావణి విషయంలో మాత్రం అలా జరగడం లేదు. తొలి నుంచి ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు.. ఇప్పుడు ఆమె అధికారం చెలాయించడాన్ని సహించలేకపోతున్నట్లు చెబుతున్నారు. దీంతోనే తరచూ విభేదాలు వస్తున్నాయని శ్రావణి వర్గీయులు ఆరోపిస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆమె తమను కలుపుకుని వెళ్లడం లేదని టు కమిటీకి చెందిన నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. నెల్లూరు పెద్దారెడ్డి వంటి నాయకుడు సలహాలపై అధారపడుతున్న ఎమ్మెల్యే శ్రావణి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, అసలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో శింగనమల రాజకీయం నిత్యం వాడివేడిగా సాగుతోంది. మరోవైపు పరిస్థితులు ఇలానే కొనసాగితే పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని ఎక్కడో ఒక చోట ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.