Begin typing your search above and press return to search.

మరో విడత ఆ మూట విప్పనున్న బాబు!

ఇపుడు మరో విడత నామినేటెడ్ పదవుల పంపిణీకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   14 July 2025 2:15 AM IST
మరో విడత ఆ మూట విప్పనున్న బాబు!
X

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి అక్షరాలా పదమూడు నెలలు పూర్తి అయింది. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కేంద్ర మంత్రులు అయిన వారు అయ్యారు. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారికి గత ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం తన సీట్లను వదిలేసుకున్న వారికీ నామినేటెడ్ పదవుల పందేరాన్ని చేపట్టారు. ఇప్పటికే పలు దఫాలుగా ఈ పదవుల పంపిణీ జరిగింది.

ఇపుడు మరో విడత నామినేటెడ్ పదవుల పంపిణీకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 14న నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున అర్హులకు ఇస్తారని అంటున్నారు. ఆ జాబితాను కూటమి విడుదల చేస్తుందని చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం అర్హులైన వారి వివరాలని జాబితాలను పంపాలని ఇప్పటికే కూటమి పెద్ద చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ జనసేన అధినాయకత్వాలను కోరారని అంటున్నారు.

దాని ప్రకారం వారంతా ఆ వివరాలను అందించారని చెబుతున్నారు. ఇక జాబితాల నుంచి వడపోసి అర్హులైన వారు నిజంగా కూటమి విజయంలో భాగస్వామ్యం అయిన వారి వివరాలను ఒక తుది జాబితాగా చేస్తున్నారని అంటున్నారు. ఆ కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందని అంటున్నారు. దాంతో చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన కంటే ముందే ఈ జాబితాలను విడుదల చేస్తారు అని అంటున్నారు.

ఎప్పటిమాదిరిగానే నామినేటెడ్ పదవులలో అగ్ర తాంబూలం టీడీపీకి ఉంటుందని అంటున్నారు. అదే విధంగా జనసేనకు కూడా కీలక పదవులు దక్కుతాయని అంటున్నారు. ఇక బీజేపీకి ఎన్ని పదవులు ఇస్తారు అన్నదే ఇపుడు ఆసక్తిని పెంచుతున్న విషయం. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా తమ పార్టీ క్యాడర్ కోసం ఎక్కువగా నామినేటెడ్ పదవులు ఇప్పించాలని కోరారు

కేవలం అయిదు శాతమే పదవులు ఇవ్వడమేంటని గుస్సా అయ్యారు. దాంతో ఈసారి అయినా బీజేపీకి సమ న్యాయం జరుగుతుందా అన్నది చర్చగా ఉంది ఇక ఏనే నామినేటెడ్ పదవుల పంపిణీ ఉంటుందన్న వివరాలలోకి వెళ్తే కనుక ఈసారి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలకు పాలక వర్గాలను నియమిస్తారని అంటున్నారు. ఏపీవ్యాప్తంగా ఏకంగా రెండు వేలకు పైగా ఈ సంఘాలు ఉన్నాయి. వీటికి చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇతర కార్యవర్గాలు ఉంటాయి. ఈ పదవులు కూడా గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా పలుకుబడి కలిగినవే అని అంటున్నారు.

అదే విధంగా ఏపీలో పెద్ద ఎత్తున దేవాలయాలు ఉన్నాయి. ఏకంగా తొమ్మిది వందలకు పైగా దేవాలయాలు ఉంటే ఇందులో ఏ గ్రేడ్ దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి. వాటికి చైర్మన్లు అంటే ఎమ్మెల్యే స్థాయిగానే ఉంటుంది ఆ తరువాత వరసగా అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిని కూడా విభజించి ఎవరికి ఎక్కడ చైర్మన్లుగా ఎంపిక చేయాలో ఆ పని కూటమి పెద్దలు కసరత్తు చేసి మరీ అర్హులకే పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు.

అలాగే ఏపీలో సొసైటీలు మరో అయిదు వందల దాకా ఉన్నాయి. వీటికి కూడా చైర్మన్ పదవులు ఇతర కార్యవర్గాలు నియమించాల్సి ఉంది. ఇలా చూస్తే కనుక ఈసారి వందలలోనే నామినేటెడ్ పదవులు లభిస్తాయని అంటున్నారు. మరి ఎవరా అదృష్టవంతులు అన్నదే చూడాల్సి ఉంది. అదే విధంగా ఈ పదవుల వల్ల కూటమిలో త్యాగ రాజులందరికీ న్యాయం జరిగినట్లేనా అన్నది కూడా విశ్లేషించాల్సి ఉంది.