Begin typing your search above and press return to search.

పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు - టీడీపీ కీలక నిర్ణయం

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రిజర్వేషన్ పెంపుపై కనీస ప్రయత్నం జరగకలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   9 Oct 2026 6:45 PM IST
పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు - టీడీపీ కీలక నిర్ణయం
X

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధికార టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పార్టీ తరఫున ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. బీసీలకు రాజ్యాధికారం, గౌరవం పెరిగేలా చూడటమే టీడీపీ బాధ్యత అంటూ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రిజర్వేషన్లకు అమలు చేయడంలో న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, పార్టీ పరంగా వెనక్కి తగ్గకూడదని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు ఇవ్వగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అధికారికంగా ప్రకటించింది.

బీసీల రాజకీయ భవిష్యత్తు, గౌరవాన్ని కాపాడేందుకు పార్టీ తరఫునే రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పడమే కాకుండా, తమది బీసీల పార్టీగా నిబద్ధతను చాటుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. గత ప్రభుత్వం బీసీలకు చేసిన నష్టాన్ని పూడ్చేలా, వారికి సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 105, జీవో 1065లను తీసుకువచ్చిందని టీడీపీ నేతలు గుర్తు చేశారు. అయితే, ఈ జీవోలను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురైనట్లుగా చెబుతోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల రిజర్వేషన్ పెంపుపై కనీస ప్రయత్నం జరగకలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమ పార్టీ వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేస్తున్నారు. స్వయంగా బీసీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారని, సానుకూల నిర్ణయం కోసం సీనియర్ అడ్వకేట్లను నియమించినట్లు వెల్లడించింది. అయినప్పటికీ, దురదృష్టవశాత్తూ సుప్రీంకోర్టు 34 శాతం రిజర్వేషన్లను అనుమతించలేదని విచారం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల నుంచి ఆశించిన తీర్పు రానంత మాత్రాన బీసీల విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని టీడీపీ తేల్చిచెప్పింది. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, రాజకీయ పార్టీగా పూర్తి బాధ్యత తీసుకుని న్యాయం చేస్తామని ప్రకటించింది.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని, ఎక్కడా తగ్గకుండా 34 శాతం సీట్లను బీసీ వర్గాలకే కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీనివల్ల బీసీల రాజకీయ గౌరవం దెబ్బతినకుండా స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు రాజ్యాధికారం, రాజకీయ గళం వినిపించే అవకాశాలు కల్పించిన చరిత్ర టీడీపీదని తెలిపింది.

కాలక్రమేణా ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ 1995లోనే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతానికి పెంచినట్లు వెల్లడించింది. అయితే, గత పాలకుల కారణంగా 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని, దీనివల్ల సుమారు 16,800 మంది బీసీలు తమ పదవులు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాకుండా, సంక్షేమ రంగంలోనూ బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని వివరించింది.