బాబు మీటింగ్ కి బాలయ్య డుమ్మా
ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ అధినాయకత్వం నిర్వహించిన ఎమ్మెల్యేల ఎంపీల విస్తృత స్థాయి సమావేశానికి ఏకంగా 15 మంది డుమ్మా కొట్టారు.
By: Tupaki Desk | 30 Jun 2025 2:11 PM ISTఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ అధినాయకత్వం నిర్వహించిన ఎమ్మెల్యేల ఎంపీల విస్తృత స్థాయి సమావేశానికి ఏకంగా 15 మంది డుమ్మా కొట్టారు. వారి మీద చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విధితమే. అయ్హితే ఆ 15 మందిలో చంద్రబాబు బావమరిది కం వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ సైతం ఉండడం టీడీపీ వర్గాలలో చర్చగా మారింది.
ఇక గైర్ హాజర్ అయిన ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే బాలయ్యతో పాటుగా భూమా అఖిలప్రియ, పల్లె సింధూర, తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంత క్రిష్ణ ప్రసాద్, వెలగపూడి రామక్రిష్ణబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుమ్మనూరి జయరాం, కాకర్ల సురేష్, అరవింద్ బాబు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, సొంగ రోషన్ కుమార్ ఉన్నారు.
ఇది చాలా పెద్ద లిస్టే. మరీ ముఖ్యంగా చూస్తే ఇందులో సీనియర్లు ఉన్నారు. పార్టీకి వీర విధేయులు కూడా ఉన్నారు. మరి వీరి గైర్ హాజరు ని ఏ విధంగా చూడాలి అన్న చర్చ సాగుతోంది. వీరందరి సంగతి పక్కన పెడితే గత కొంతకాలంగా బాలయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది.
ఆయన కడపలో నిర్వహించిన మహానాడుకు హాజరు కాలేదు. అంతే కాదు వెలగపూడిలో ఇర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని అంటున్నారు ఇపుడు చూస్తే పార్టీ అత్యంత కీలకం అని భావిస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదని అంటున్నారు.
మరి బాలయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు నిజంగా ఆయనకు ఇదే సమయంలో పనులు ఉండి రావడం లేదా అన్న చర్చ సాగుతోంది. మహానాడు సమయంలో ఆయన సినిమా షూటింగులో ఉన్నారు అనుకున్నా మిగిలిన కార్యక్రమాలకు రాకపోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది. ఇక పార్టీ ఎంపీల విషయానికి వస్తే విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బాపట్ల ఎంపీ టీ క్రిష్ణ ప్రసాద్ కూడా హాజరు కాలేదని అంటున్నారు.
దీంతోనే అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాలకే హాజరు కాకపోతే ఇక ప్రజలతో మమేకం ఎలా అవుతారు అన్నది కూడా ఆయన రైజ్ చేస్తున్న పాయింట్ గా ఉంది అంటున్నారు.
కాలం మారుతోందని, అందువల్ల ఎమ్మెల్యేల తీరు కూడా మారాలని వారే నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువగా తిరగాల్సి ఉందని కూడా బాబు అంటున్నారు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు అన్నది గుర్తుంచుకోవాలని బాబు అంటున్నారు. ప్రజలలో లేని వారికి విజయాలు సైతం దక్కవని ఆయన పరోక్ష హెచ్చరికలనూ జారీ చేస్తున్నారు. ఇక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తమకు వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికల మీద బయట మాట్లాడడం కంటే తనతోనే నేరుగా మాట్లాడాలని వారికి తగిన సమయం ఇస్తామని అంటున్నారు.
ఇక తానా సభలకు వెళ్ళిన వారు సమావేశానికి గైర్ హాజరు అయిన వారు మీటింగ్ కి వచ్చి మధ్యలో వెళ్ళిపోయిన వారు సంతకాలు పెట్టి ముందే వెళ్ళిన వారు ఇలా అందరి వివరాలు తన దగ్గర ఉన్నాయని ఈ విషయాల మీద సీరియస్ గానే ఆలోచిస్తాను అని బాబు అంటున్నారు. మరి బాలయ్య సహా చాలా మందే లిస్ట్ లో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమి చేస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
