విశాఖలో ఎకరా 99 పైసలు.. ఎంత చవక ధరో కదా?
ఇలా ఒకటి రెండు కాదు 99 పైసలు చొప్పున మొత్తం 21.6 ఎకరాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు అప్పగించాలని మంత్రి మండలి ఆమోదం తీసుకుంది.
By: Tupaki Desk | 16 April 2025 11:13 AM ISTరాష్ట్రంలో ఖరీదైన ప్రాంతం విశాఖ.. ఆ నగరంలోనే అత్యంత విలువైన ప్రదేశం రుషికొండ.. అక్కడ ఎకరా భూమి కనీసం 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అంత ధర చెల్లించినా భూమి లభ్యమవడం కష్టమే.. కానీ అంత ఖరీదైన ప్రాంతంలో కేవలం 99 పైసలకే ఎకరా భూమిని లీజుకివ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఒకటి రెండు కాదు 99 పైసలు చొప్పున మొత్తం 21.6 ఎకరాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు అప్పగించాలని మంత్రి మండలి ఆమోదం తీసుకుంది.
99 పైసలు అంటే చాలా తక్కువ. ఆ ధరకు కనీసం అడుగు జాగా కూడా ఎక్కడా దొరకదు. కానీ, ఎకరా స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేయడానికి కారణం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై ఉన్న నమ్మకమే. దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సంస్థ తన ఆపరేషన్స్ సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1370 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో రాష్ట్రానికి దాదాపు 12 వేల ఉద్యోగాలు కొత్తగా రానున్నాయి. అంతేకాకుండా టీసీఎస్ ఏర్పాటుతో విశాఖ ఐటీ హబ్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే కొత్త ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం 99 పైసలకే ఎకరా భూమిని ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి టీసీఎస్ కు ఉచితంగానే భూమి ఇవ్వాలని మంత్రివర్గం భావించింది. కానీ, ఎంతో కొంత ధర నిర్ణయించాల్సివుండటంతో 99 పైసలుగా నిర్ణయించారు.
విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని వాస్తవరూపంలో తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. గత ఏడాదే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ చర్చలు ప్రారంభించారు. అప్పట్లోనే విశాఖలో ఆపరేషన్ సెంటర్ ప్రారంభానికి టాటా సన్స్ ముందుకొచ్చింది. మరోవైపు రుషికొండపై ఉన్న మిలీనియం టవర్స్ లో కొంత స్పేస్ ను టాటా సన్స్ కు తాత్కాలికంగా అప్పగించి కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని ప్రభుత్వం భావించింది. అయితే శాశ్వత భవనం నిర్మించేందుకు టాటా సన్స్ ఆసక్తి చూపింది. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై భూములను కేటాయించింది.
విశాఖలో ఐటీ పరిశ్రమ విస్తరణకు టీసీఎస్ యాంకర్ గా పనిచేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సనంద్ లో టాటా మోటార్స్ కు స్థలం కేటాయించారు. ఆ తర్వాత సనంద్ దేశంలోనే ప్రఖ్యాత ఆటోమొబైల్ హబ్ గా అవతరించిందని చెబుతారు. ఇదే క్రమంలో విశాఖలో టీసీఎస్ ఏర్పాటు అవడం ద్వారా ఐటీ హబ్ గా ఎదుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా, హిల్ నెంబర్ 3లో ఉన్న మిలీనియం టవర్స్ లో తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభానికి టీసీఎస్ సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఇక్కడ టీసీఎస్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో శాశ్వత భవనం నిర్మాణానికి టీసీఎస్ చర్యలు తీసుకుంటోంది.
