Begin typing your search above and press return to search.

పట్టు కోసం టీ కాంగ్రెస్ పక్కా ప్లాన్: 17 ఇంఛార్జులు వచ్చేశారు!

తెలంగాణ కాంగ్రెస్ మాంచి దూకుడు మీద ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. అధికారాన్ని సొంతం చేసుకున్న వైనం ఆ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 4:02 AM GMT
పట్టు కోసం టీ కాంగ్రెస్ పక్కా ప్లాన్: 17 ఇంఛార్జులు వచ్చేశారు!
X

తెలంగాణ కాంగ్రెస్ మాంచి దూకుడు మీద ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. అధికారాన్ని సొంతం చేసుకున్న వైనం ఆ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చింది. సరిగ్గా నెలన్నర క్రితం.. కాంగ్రెస్ చేతికి అధికారం వస్తుందన్న మాట చెబితే నమ్మలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకొని అందరి చూపు తన మీద పడేలా చేసుకుంది. కేసీఆర్ లాంటి బలమైన అధినేతను మట్టి కరిపించిన తీరుతో కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.

మరో మూడు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు మరింత పక్కాగా ప్లాన్ చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో తన సత్తా చాటాలని.. తన పట్టును అందరికి తెలిసేలా చేయాలని తపిస్తోంది. అందుకే.. మిగిలిన పార్టీల కంటే ముందుగా అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని తపిస్తోంది.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇంత ముందుగా ఇంఛార్జిలను నియమించటం ద్వారా.. ఆయా నియోజకవర్గాల మీద పట్టు సాధించటంతో పాటు గెలుపు గుర్రాల్ని గుర్తంచే వీలుంటుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే జనవరిలోనే అభ్యర్థుల్ని నిర్ణయించనున్నట్లుగా చెబుతున్నారు.

ఇలా చేయటం ద్వారా పార్టీ వర్గాల్ని ఒక జట్టుగా చేసేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు పార్టీకి చెందిన కీలక నేతల్ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భారీ కసరత్తు చేసింది. ఇంతకూ వారెవరు? ఏ నియోజకవర్గానికి ఎవరిని ఇంఛార్జులుగా నియమించిందన్న విషయంలోకి వెళితే..

పార్లమెంట్ స్థానం ఇంఛార్జి నేత

ఆదిలాబాద్ సీతక్క

పెద్దపల్లి శ్రీధర్‌బాబు

కరీంనగర్ పొన్నం ప్రభాకర్

నిజామాబాద్ జీవన్‌రెడ్డి

జహీరాబాద్ పి.సుదర్శన్ రెడ్డి

మెదక్ దామోదర్ రాజనర్సింహ

మల్కాజ్‌గిరి తుమ్మల నాగేశ్వరరావు

నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు

నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి

భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వరంగల్ కొండా సురేఖ

ఇక.. మరో ఆరు నియోజకవర్గాల విషయానికి వస్తే.. రెండేసి నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున ఇంఛార్జిలను నియమించటం గమనార్హం. చేవెళ్ల -మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని.. హైదరాబాద్ - సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నియమించారు. ఇక.. మహబూబాబాద్ - ఖమ్మం స్థానాల పార్లమెంట్ ఇంఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.