రైల్వే తత్కాల్ టైమింగ్స్‌లో మార్పు.. రైల్వే శాఖ క్లారిటీ
భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుండి ఓ ఫోటో విస్తృతంగా వ్యాపించింది.
By: Tupaki Desk | 12 April 2025 3:15 PM ISTభారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగాయంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుండి ఓ ఫోటో విస్తృతంగా వ్యాపించింది. ఏప్రిల్ 15 నుండి కొత్త తత్కాల్ సమయాలు అమల్లోకి వస్తాయని ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే, ఇది నకిలీ వార్త అని భారతీయ రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం ధృవీకరించాయి. ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
ఒక అధికారిక ప్రకటనలో.. "నకిలీ వార్త హెచ్చరిక: ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ సమయాలు మారుతాయని సోషల్ మీడియాలో ఒక ఫోటో విస్తృతంగా వైరల్ అవుతోంది. #PIBFactCheck. ఈ వాదన నకిలీది. AC లేదా నాన్-AC తరగతుల కోసం తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్‌లో ప్రస్తుతం అలాంటి మార్పులు ప్రతిపాదించబడలేదు. ఏజెంట్ల కోసం అనుమతించబడిన బుకింగ్ సమయాలు కూడా మారవు" అని తెలిపింది.
ప్రస్తుతానికి తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్‌లలో సమయాల్లో ఎటువంటి మార్పులు ప్రతిపాదించబడలేదని ధృవీకరించారు. ఏజెంట్ల కోసం అనుమతించబడిన బుకింగ్ సమయాలు కూడా మారవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్త లో, AC తరగతి తత్కాల్ బుకింగ్ సమయాలు ఉదయం 10 గంటల నుండి 11 గంటలకు, నాన్-AC తరగతి తత్కాల్ బుకింగ్ సమయాలు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు మారుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టతతో, ప్రజలు ఇప్పుడు సాధారణ సమయాల ప్రకారం వారి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి నకిలీ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు.
