Begin typing your search above and press return to search.

టాటా ట్రస్టు నుంచి భారీగా ఎన్నికల విరాళాలు.. ఒక్క పైసా అందుకోని టీడీపీ, జనసేన!

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థల సమూహమైన టాటా గ్రూపు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడం చర్చనీయాంశం అవుతోంది.

By:  Tupaki Desk   |   5 Dec 2025 4:00 AM IST
టాటా ట్రస్టు నుంచి భారీగా ఎన్నికల విరాళాలు.. ఒక్క పైసా అందుకోని టీడీపీ, జనసేన!
X

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థల సమూహమైన టాటా గ్రూపు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయడం చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికలకు ముందు అధికార బీజేపీతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి కూడా టాటా గ్రూపు విరాళాల అందజేసింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు నిధులు సమకూర్చిన టాటా గ్రూపులోని ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు కొన్ని ముఖ్యమైన పార్టీలను విస్మరించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టాటా గ్రూప్ తన వ్యాపారాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలు సమకూర్చుతుంటుంది. దేశంలోని ఇతర పెద్ద కార్పొరేట్ సంస్థల మాదిరిగానే టాటా గ్రూప్ కూడా విరాళాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దేశంలోని మొత్తం పది పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాటా గ్రూపునకు చెందిన పీఈటీ అత్యధికంగా కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీకి రూ.757 కోట్లు అందజేయడమే చర్చనీయాంశం అవుతోంది. మొత్తం పది పార్టీలకు కలిపి రూ.914 కోట్లు విరాళంగా ఇవ్వగా, అందులో 83 శాతం నిధులను బీజేపీకే కేటాయించడంపై పెద్ద చర్చ జరుగుతోంది.

పీఈటీ నుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి కేవంల రూ.77.3 కోట్లు మాత్రమే అందింది. ఇది బీజేపీకి అందిన విరాళంలో కేవలం 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. రెండు ప్రధాన జాతీయ పార్టీలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, శివసేన, బీజేడీ, బీఆర్ఎస్, ఎల్జేపీ, జేడీయూ, డీఎంకే పార్టీలకు పీఈటీ నుంచి రూ.10 కోట్లు చొప్పున విరాళాలు అందాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ రూ.10 కోట్లు చొప్పున విరాళాలు అందుకోగా, ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయి.

ఇక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన టీడీపీ, జనసేన పార్టీలకు ఒక్క రూపాయి కూడా టాటా నుంచి విరాళంగా అందకపోవడం గమనార్హం. 2024-25లో వివిధ ట్రస్టులు, సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా రూ.517 కోట్లు విరాళంగా అందాయి. ఫ్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.216.33 కోట్లు, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.15 కోట్లు న్యూ డెమొక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ.5 కోట్లు జన్ కల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.9.5 లక్షల చొప్పున కాంగ్రెస్ పార్టీకి విరాళాలు అందాయి.