Begin typing your search above and press return to search.

టాటా రేంజ్ మారిపోనుంది.. కార్లు, బస్సులతో సహా హెలికాప్టర్లు కూడా

భారతీయ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టుతో ముందుకు వస్తోంది.

By:  Tupaki Desk   |   27 May 2025 7:00 PM IST
టాటా రేంజ్ మారిపోనుంది.. కార్లు, బస్సులతో సహా హెలికాప్టర్లు కూడా
X

భారతీయ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టుతో ముందుకు వస్తోంది. ఇప్పటికే ఎయిర్‌లైన్స్‌ను నడుపుతున్న టాటా, త్వరలో హెలికాప్టర్లను కూడా తయారు చేయనుంది. ఇది భారతీయ ఏరోస్పేస్ రంగంలో ఒక కీలక అడుగు అనే చెప్పాలి. యూరప్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌బస్ (Airbus), టాటా గ్రూప్ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాయి. భారత వైమానిక దళం కోసం H125 హెలికాప్టర్ల తుది అసెంబ్లీ లైన్‌ను కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇది భారత్ మొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ కావడం విశేషం.

'మేక్ ఇన్ ఇండియా'కు బలం

ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత బలాన్ని చేకూర్చనుంది. దీని ద్వారా దేశంలోనే ఎయిర్‌స్పేస్ తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యం నెరవేరుతుంది. ఈ యూనిట్ ఎయిర్‌బస్ అత్యధికంగా అమ్ముడయ్యే సివిల్ కేటగిరీకి చెందిన H125 హెలికాప్టర్లను తయారు చేస్తుంది. ఇది ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే నాల్గవ అలాంటి ఉత్పత్తి ప్లాంట్‌గా నిలవనుంది.

మొదట్లో ఈ యూనిట్ సంవత్సరానికి 10 హెలికాప్టర్‌ల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తుంది. అయితే రాబోయే కాలంలో దీనిని మరింత వేగంగా విస్తరించనున్నారు. ఎందుకంటే, రాబోయే 20 ఏళ్లలో భారతదేశం, దక్షిణ ఆసియాలో 500 తేలికపాటి హెలికాప్టర్‌లకు డిమాండ్ ఉంటుందని ఎయిర్‌బస్ అంచనా వేసింది.

కొలార్ జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు

ఈ హెలికాప్టర్ల తయారీ యూనిట్ బెంగళూరుకు సుమారు రెండు గంటల దూరంలో ఉన్న వెమగల్ పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు కానుంది. ఇక్కడే టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) ఇతర ప్లాంట్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇటీవల టాటా వెమగల్ పారిశ్రామిక ప్రాంతంలో 7.4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ విమాన నిర్మాణం, తుది అసెంబ్లీ, MRO (మెయింటెనెన్స్, రిపేర్, అండ్ ఓవర్‌హాల్) సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

కొత్త ఉద్యోగ అవకాశాలు

ఈ చొరవ దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని ఎక్వస్ (Aequs) ఛైర్మన్, సీఈఓ అరవింద్ మోలిగేరి తెలిపారు. ఇది సప్లై చైన్‌లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, క్లస్టర్ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఇటీవల టాటా, ఎయిర్‌బస్‌లకు గుజరాత్‌లోని వడోదరలో సెమీకండక్టర్ ప్లాంట్, C295 విమాన తయారీ వంటి పెద్ద పెట్టుబడి ప్రాజెక్టులు కూడా లభించాయి. ఈ కారణంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించాయి.