Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో పాక్ దుర్మార్గాల్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన మహిళ

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలిలో కశ్మీరీ హక్కుల కార్యకర్త తస్లీమా అక్తర్ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 4:27 AM GMT
కశ్మీర్ లో పాక్ దుర్మార్గాల్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన మహిళ
X

కశ్మీర్ లో దాయాది పాక్ దుర్మార్గాలు ఎన్నన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా అంతర్జాతీయ వేదిక మీద చెప్పిన కశ్మీరీ యువతి ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో కశ్మీరీ సామాజిక కార్యకర్త పాక్ బండారాన్ని బట్టబయలు చేవారు. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు.. కశ్మీర్ లో ఏ విధంగా మారణకాండకు పాల్పడుతున్నారో ఆమె చెప్పుకొచ్చారు.

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలిలో కశ్మీరీ హక్కుల కార్యకర్త తస్లీమా అక్తర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన కళ్లతో చూసిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. తాను చెప్పే చాలా విషయాలు ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని కథలుగా ఆమె చెప్పారు. పాక్ సాయంతో చేసే ఉగ్రదాడుల కారణంగా చాలామంది మహిళలు తమ బిడ్డల్ని.. భర్తల్ని కోల్పోయారన్నారు.

తన చిన్నతనం నుంచి పాక్ దుర్మార్గాలకు ప్రత్యక్ష సాక్షిగా ఆమె పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా అమాయకుల హత్యల్ని తాను చూస్తూ పెరిగినట్లు చెప్పారు. ఉగ్రవాదుల చేతుల్లో బలైన బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద ఊచకోతలతో బలైన వారి కన్నీటి గాథలతో తాను వచ్చినట్లుగా చెప్పుకున్న ఆమె ప్రసంగం ఇప్పుడు అందరి చూపు పడేలా చేస్తోంది.

ఉగ్ర చర్యల్లో తమకు సహకారం అందించేందుకు ఒప్పుకోని ఎంతోమంది అమాయుల్నిపాక్ ఉగ్రవాదులు హతమార్చారన్నారు. వారిలో చాలామంది ఒంటరిగా మారినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద బాధిత కుటుంబాల దయనీయమైన.. భావోద్వేగ కథలు ఉన్నాయని.. ఈ శూన్యాన్ని రాబోయే తరాలు పూరించలేవన్నారు. ప్రపంచం కశ్మీరీ ప్రజలు పడిన కష్టాలను తెలుసుకోవాలని.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను మానవహక్కుల కౌన్సిల్ ను కోరుతున్నట్లుగా చెప్పారు.