Begin typing your search above and press return to search.

త‌ణుకు.. పొలిటిక‌ల్ వ‌ణుకు!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ర‌చ్చ చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   19 April 2025 11:20 AM IST
త‌ణుకు.. పొలిటిక‌ల్ వ‌ణుకు!
X

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ర‌చ్చ చోటు చేసుకుంది. గ‌త నాలుగు రోజులుగా ఇక్క‌డ పాలిటిక్స్ హెటెక్కినా.. ఇప్పుడు మాత్రం మ‌రింత పెరిగింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే కాక రేపుతోంది. అధికార టీడీపీ వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కుల మ‌ధ్య దుమ్మురేపేలా మాట‌ల యుద్దం సాగుతోంది. వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావును ఉద్దేశించి.. టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప‌రుషంగానే వ్యాఖ్యానించారు. `నూక‌లు చెల్లుతాయ‌ని` హెచ్చ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌కుండా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో ఇరు ప‌క్షాల రాజ‌కీయ యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరింది. కొన్నాళ్ల కింద‌ట‌.. కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు ఎవ‌రూ అందుబాటులో ఉండ‌డం లేద‌ని అధికార పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు. అప్ప‌ట్లోనే కారుమూరిపై టీడీపీ నాయ‌కులు ఫైర‌య్యారు. దీనికి ముందు తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి రెచ్చిపోయారు. ఎందుకూ ప‌నికిరాని ఒక వ్య‌క్తి ఇక్క‌డ గెలిచాడ‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న దూష‌ణ‌ల‌కు కూడా దిగారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే ఆరిమిల్లి స్పందిస్తూ.. ఘాటుగా వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో కారుమూరి బ్యాచ్ మ‌రింత ర‌చ్చ చేసింది. ఎమ్మెల్యే ఆరిమిల్లిపై త‌ప్పుడు ప్ర‌చారానికి దిగింద‌ని ఆయ‌న వ‌ర్గం నిప్పులు చెరుగుతోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి పొద్దుపోయాక‌.. మ‌రోసారి రాధాకృష్ణ కారుమూరికి వార్నింగ్ ఇచ్చారు. ``తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వబోం. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. నూక‌లు చెల్లిస్తాం`` అని తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీనికి కౌంట‌ర్‌గా వెంట‌నే స్పందించిన కారుమూరి.. నూక‌లు చెల్లిస్తాం అంటే, త‌న‌ను హ‌త్య చేసేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``నాకు నూకలు చెల్లుతాయని ఎమ్మెల్యే ఆరిమిల్లి చెప్పడం చూస్తుంటే.. హత్య చేయాలని చూస్తున్నారు`` అని వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తన ఇంటిని ముట్టడి చేయడం అందులో భాగమన్నారు. రోజుకి నాలుగు గంటలు తన గురించే ఆలోచిస్తూ ఎమ్మెల్యే ఆరమిల్లి బీపీ పెంచుకుంటున్నారని, చ‌దువుకున్న అజ్ఞానితో తాను ఇక‌, మాట్లాడేది లేద‌ని.. త‌న‌కు సంస్కారం ఉంద‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి త‌ణుకు రాజ‌కీయం ఒక‌ర‌కంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య వ‌ణుకు పుట్టిస్తోంది. మ‌రి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.