తానాలో నో ఎలక్షన్.. ఓన్లీ సెలక్షన్.. చట్టబద్ధతపై ప్రశ్నలు!
అమెరికాలోని తెలుగు ప్రజలకు ఒక గౌరవ ప్రతీకగా నిలిచిన తానా ఇప్పుడు తన పారదర్శకత, ప్రజాస్వామ్య స్వభావంపైనే ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
By: Tupaki Desk | 19 Jun 2025 11:09 AM ISTఅమెరికాలో తెలుగువారి ప్రతిష్టాత్మక సంస్థ అయిన తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఇటీవల కాలంలో పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. నిధుల దుర్వినియోగం, అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలతో సతమతమవుతున్న తానా.. తాజాగా ఎన్నికల ప్రక్రియను విస్మరించి ఎంపిక సంఘం ద్వారా నూతన కమిటీని నియమించాలని నిర్ణయించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సంస్థ ఈ నిర్ణయం చట్టబద్ధతపై, సభ్యుల హక్కులపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అమెరికాలోని తెలుగు ప్రజలకు ఒక గౌరవ ప్రతీకగా నిలిచిన తానా ఇప్పుడు తన పారదర్శకత, ప్రజాస్వామ్య స్వభావంపైనే ప్రశ్నలను ఎదుర్కొంటోంది. సాధారణంగా, ప్రజాస్వామ్య సంస్థల్లో నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికల ప్రక్రియను అనుసరిస్తారు. అయితే ఈసారి తానా నిర్వాహకులు ముగ్గురు సభ్యులతో కూడిన ఎంపిక సంఘాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారానే నూతన కమిటీని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సంస్థలోని సుమారు 70,000 మంది సభ్యులలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
ఈ ఎంపిక విధానం వెలుగులోకి వచ్చిన తర్వాత, అనేక మంది అభ్యర్థులు నామినేషన్లు వేయకుండానే వెనక్కి తగ్గారని సమాచారం. ఫలితంగా దాదాపు 40కి పైగా పదవులకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆ పదవులన్నీ ఏకగ్రీవంగా ఖరారయ్యే పరిస్థితి నెలకొంది. తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ పదవికి ఐదుగురు అవసరం కాగా ఆరు పేర్లు దాఖలయ్యాయి. అందులో ఒకరు "ఫేవర్‌డ్ గ్రూప్" బయటి వ్యక్తి అని తెలుస్తోంది. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి మాత్రం ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండగా మిగతా అన్ని పదవులకు పోటీ లేకుండా పోయింది.
- చట్టబద్ధతపై సందేహాలు
తానా వంటి 501(c)(3) నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్వతంత్ర ఎన్నికలను నిర్వహించాలనే నిబంధన ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, తానా బైలాస్ సంస్థ నిబంధనల్లో ఈ "ఎంపిక కమిటీ ద్వారా ఎన్నికలు" అనుమతించబడుతుందా లేదా అనేది. ఒకవేళ బైలాస్‌లో దీనికి అనుమతి ఉంటే, ఈ ప్రక్రియ చట్టబద్ధమైనదిగా పరిగణించబడవచ్చు. లేకపోతే ఇది సభ్యుల అభిప్రాయం, హక్కుల ఉల్లంఘనగా పరిణమించే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇది అమెరికా చట్టాల ప్రకారం కోర్టు వివాదాలకు దారితీయవచ్చు. సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టీకరణ లేకపోవడంతో అనేక సందేహాలు నెలకొన్నాయి. అసలు ఈ ఎంపిక పద్ధతికి సభ్యుల సాధారణ సభ అనుమతి ఉందా? లేక ఇది కేవలం తాత్కాలిక నిర్ణయమా? అన్న దానిపై స్పష్టత కొరవడింది.
- సభ్యుల నిరాశ, పారదర్శకతపై ఆందోళన
సంస్థలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న కొందరు ప్రముఖులు ఈ విధానం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. "70,000 మందికి పైగా సభ్యులు ఉన్న సంస్థలో ఎన్నికలే జరగకపోవడం దురదృష్టకరం" అని వారు విమర్శిస్తున్నారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల సంస్థ తన స్వచ్ఛతను, పారదర్శకతను కోల్పోతుందని అభిప్రాయపడుతున్నారు.
తానా తాజా వ్యవహారం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది చట్టబద్ధమా, లేక సభ్యుల హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలా అనేది ఇప్పుడు న్యాయ నిపుణుల, సంస్థ నేతల స్పష్టీకరణపై ఆధారపడి ఉంది. లేకపోతే, ఈ వివాదం కోర్టు మెట్లెక్కే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తానా నాయకత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి, సభ్యుల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.
