Begin typing your search above and press return to search.

తమ్మినేని సీట్లోకి డాక్టర్ గారు..?

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి ఈసారి ఎన్నికల్లో కొత్త ముఖాలు రంగ ప్రవేశం చేయనున్నాయి. పలు కీలక స్థానాల నుంచే వారికి అవకాశం కల్పించేలా అధినాయకత్వం పావులు కదుపుతోంది.

By:  Tupaki Desk   |   30 July 2023 4:21 AM GMT
తమ్మినేని సీట్లోకి డాక్టర్ గారు..?
X

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి ఈసారి ఎన్నికల్లో కొత్త ముఖాలు రంగ ప్రవేశం చేయనున్నాయి. పలు కీలక స్థానాల నుంచే వారికి అవకాశం కల్పించేలా అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇక ఆముదాలవలస అంటే తమ్మినేని సీతారాం అని పేరు పొందారు. ఆయన 1983లో టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టి 1983, 1985లలో తిరిగి 1994, 1999లలో గెలిచారు. ఇక 2019లలో వైసీపీ నుంచి అయిదవ సారి గెలిచారు.

ఈ మధ్యలో ఆయన 1989, 2004, 2009, 2014లలో ఓటమి పాలు అయ్యారు. టీడీపీ ప్రజారాజ్యం, టీడీపీ వైసీపీ ఇలా పార్టీలు మారారు. అయితే గత నలభై ఏళ్ళుగా ఆయన ప్రతీ ఎన్నికల్లోనూ ఆముదాలవలస నుంచి ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేస్తూనే ఉన్నారు.

కానీ ఫస్ట్ టైం ఆయన ఆముదాలవలస సీటు నుంచి వేరొక అభ్యర్ధి పోటీ చేస్తారా అన్న చర్చ అయితే జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆయన ఎవరో కాదు జిల్లాలో డాక్టర్ గా ఎంతో ప్రాముఖ్యత గడించిన డాక్టర్ దానేటి శ్రీధర్ అని అంటున్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. గత రెండున్నర దశాబ్దాలుగా జిల్లాలో ఆయన వైద్యునిగా విశేష పేరు సంపాదించుకున్నారు.

ఆయనకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. ఆయన ఎంపీగా శ్రీకాకుళం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి ఆయన ఎంపీ అభ్యర్ధి అని ప్రచారం అయితే గట్టిగా ఉంది. కానీ అధినాయకత్వం మాత్రం ఆయనను ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రతిపాదిస్తోంది అని అంటున్నారు.

ఆముదాలవలస సీటు చాలా కీలకం. పైగా అక్కడ టీడీపీ బలంగా ఉంది. తమ్మినేని సీతారాం మేనల్లుడు శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవి కుమార్ 2024లో పోటీకి రెడీగా ఉన్నారు. వైసీపీలో వర్గ పోరు తీవ్రంగా ఉంది. తమ్మినేనికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదని వ్యతిరేక వర్గాలు అధినాయకత్వానికి స్పష్టం చేస్తున్నాయి.

దాంతో ఈ సీటు నుంచి కొత్త ముఖంగా ఉన్న డాక్టర్ గారిని పోటీకి పెడితే ప్రజలలో మంచి పేరు ఉన్న ఆయన గెలుపు సులువు అవుతుంది అని వైసీపీ అంచనా కడుతోంది. అదే విధంగా బలమైన సామాజికవర్గం తటస్థులు, ఇతర వర్గాలు కూడా టర్న్ అవుతాయని అంటున్నారు.

ఇక తమ్మినేనిని శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీ చేయించే ఆలోచన ఉందని అంటున్నారు. కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేనికి టికెట్ ఇస్తే ఇరవై లక్షల మంది దాకా జనాభా టర్న్ అవుతుందని దాంతో గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ అంచనా కడుతోంది. అలా తమ్మినేనికి న్యాయం చేసినట్లుగా ఉంటుంది, ఇటు వైపు ఆముదాలవలస కూడా పార్టీ ఖాతాలో పడుతుంది అని భావిస్తోంది.

అయితే చిత్రమేంటి అంటే తమ్మినేని అసెంబ్లీకే పోటీ అంటూంటే డాక్టర్ గారు ఎంపీగానే అంటున్నారు. మరో వైపు తమ్మినేని తాను ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే తన కుమారుడికి సీటు ఇవ్వాల్సిందే అని అంటున్నారని టాక్. మొత్తానికి ఆముదాలవలస వదులుకోవడానికి ఇష్టపడడంలేదని తెలుస్తోంది. మరి ఈ చిక్కుముడులను విప్పి వైసీపీ హై కమాండ్ ఎలా ఒప్పిస్తుందో చూడాలని అంటున్నారు. అయితే పార్టీ విజయమే ముఖ్యం తప్ప మరేమీ కాదని కఠిన నిర్ణయంతో హై కమాండ్ ఉన్న నేపధ్యంలో ఆముదాలవలస నుంచి డాక్టర్ గారు పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.