Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ప్రభుత్వంపై తమిళి సై సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో గత కేసీఆర్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ తమిళి సైకి మధ్య వివిధ అంశాల్లో తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jan 2024 5:52 AM GMT
కేసీఆర్‌ ప్రభుత్వంపై తమిళి సై సంచలన వ్యాఖ్యలు!
X

తెలంగాణలో గత కేసీఆర్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌ తమిళి సైకి మధ్య వివిధ అంశాల్లో తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గవర్నర్‌ ను ఏ సందర్భంలోనూ కేసీఆర్‌ మంత్రివర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు జిల్లా స్థాయి అధికారులు కూడా లక్ష్యపెట్టలేదు. ఆమె జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు కనీసం ప్రొటోకాల్‌ కూడా పాటించలేదు. ఈ నేపథ్యంలో పలుమార్లు గవర్నర్‌ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి రిపబ్లిక్‌ డే వేడుకలను పురస్కరించుకుని గవర్నర్‌ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. తద్వారా తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు.

తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని తమిళి సై తూర్పారబట్టారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు హర్షించలేరన్నారు. పదేళ్ల పాలనలో లేని రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్‌ నిర్మించుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని వెల్లడించారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి్ధ ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని తమిళి సై పేర్కొన్నారు.

ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని తమిళి సై వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతోనే పని మొదలు పెట్టిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని మండిపడ్డారు.

గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారిందని తమిళి సై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

దావోస్‌ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని తమిళి సై తెలిపారు. ఇందుకు సీఎం, ఆయన బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నామని చెప్పారు.

మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైందని రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో వ్యవహరించి దానిని తయారు చేశారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు రాజ్యాంగం తోడ్పడిందని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేశారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు, సైనికుల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు.