Begin typing your search above and press return to search.

తమిళనాట ''అమ్మా''డీఎంకే.. స్థాపించేదెవరంటే..?

దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా, సామాజికంగా, సినిమాపరంగా అత్యంత చైతన్యం ఉండే రాష్ట్రం తమిళనాడు

By:  Tupaki Desk   |   15 Dec 2023 11:18 AM GMT
తమిళనాట అమ్మాడీఎంకే.. స్థాపించేదెవరంటే..?
X

దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా, సామాజికంగా, సినిమాపరంగా అత్యంత చైతన్యం ఉండే రాష్ట్రం తమిళనాడు. మిగతాచోట్ల ఇప్పుడు చూస్తున్న మార్పులు తమిళనాడులో 50 ఏళ్ల కిందటనే వచ్చాయి. కులస్వామ్యంపై పోరాటం.. ఢిల్లీ ఆధిపత్యంపై తిరుగుబాటు.. సొంత భాషను కాపాడుకోవాలన్న పట్టుదల.. ఇవన్నీ తమిళనాడులో చూస్తుంటాం.. అంతెందుకు..? తమినళాడు లో జాతీయ పార్టీలు అధికారం కోల్పోయి 50 ఏళ్లు కావడాన్ని బట్టి చూస్తేనే అక్కడ ప్రాంతీయత ప్రభావం ఎలాంటిదో తెలుస్తుంది.

ప్రాంతీయ పార్టీలదే పెత్తనం

తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. డీఎంకే ఆవిర్భావంతో కాంగ్రెస్ కు నూకలు చెల్లాయి. ఆపై అన్నాడీఎంకే పుట్టడంతో జాతీయ పార్టీలు వేటికీ చోటు లేకుండా పోయింది. ఇప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్.. ఏదో ఒక ప్రాంతీయ పార్టీని అట్టిపెట్టుకుని తమిళనాడులో కాలుమోపాలని చూస్తున్నాయి. కాగా.. డీఎంకే పార్టీ కరుణానిధి చేతుల్లోకి వెళ్లిపోయాక.. ఆయనను విభేదించి ఎంజీ రామచంద్రన్ స్థాపించిన పార్టీనే అన్నాడీఎంకే.. ఇక ప్రస్తుత తరంలో అన్నాడీఎంకే అంటే.. ఎక్కువమందికి గుర్తుకొచ్చేది దివంగత సీఎం జయలలితే. కాగా, అవినీతి కేసుల్లో ఆమె జైలుపాలైన సమయంలోనూ పట్టు పార్టీని పట్టుసడలకుండా కాపాడారు. ఆ సమయంలో తనకు ఎంతో నమ్మకస్తుడైన ఒ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్)ను సీఎం చేశారు. మరోవైపు సరిగ్గా ఏడేళ్ల కిందట జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళ సీఎం అవుతారని అనుకుంటుండగా.. ఆమెను జైల్లో వేసిన కేంద్ర ప్రభుత్వం తమిళనాడును పరోక్షంగా గుప్పిట్లోకి తెచ్చుకుంది.

అన్నాడీఎంకే చీలుతుందా?

జయలలిత మరణం అనంతరం కొద్ది రోజులు పన్నీర్ సెల్వం సీఎంగా పనిచేసినా.. ఆ తర్వాత ఎడప్పాడి పళనిస్వామికి ఆ పదవి దక్కింది. పన్నీర్ డిప్యూటీగా వ్యవహరించారు. 2021 వేసవిలో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే సర్కారు పడిపోయింది. కాగా, అంతకుముందే అన్నాడీఎంకే పళని, పన్నీర్ వర్గాలుగా చీలిపోయింది. కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ ప్రారంభించేందుకు పన్నీర్‌సెల్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆయన దీనికోసం మద్దతుదారులతో సమావేశం నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ వేటు, పళనిస్వామికి వ్యతిరేకంగా జరిపిన న్యాయ పోరాటంలో విఫలమైన ఆయన.. ఆ తర్వాత కూడా పార్టీ జెండా, పేరు ఉపయోగిస్తూ వచ్చారు. దీనిపై నిషేధం విధించాలని పళనిస్వామి హైకోర్టులో కేసు వేసి నెగ్గారు. కాగా, ఈ వ్యవధిలో పన్నీర్ సెల్వం విదేశాల్లో చికిత్సకు వెళ్లారు. తాజాగా తిరిగొచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి పార్టీ జెండా లేని కారులో ప్రయాణం చేశారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే జనరల్‌ కమిటీ తీర్మానాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో పన్నీర్‌సెల్వం వేసిన దావా జనవరి 11న విచారణకు రానుంది. ఇప్పటికే వేరే కేసుల్లో సుప్రీంకోర్టులో ఎడప్పాడికి మద్దతుగా తీర్పు లభించాయి. మళ్లీ ఆయనకే అనుకూలంగా తీర్పు వస్తే భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోవాలని ఓపీఎస్‌ అనుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా నిర్వాహకులను నియమించి అందరినీ ఒకచోట చేర్చనున్నారు. ఆ తర్వాత కొత్త పార్టీపై నిర్ణయాలు ప్రకటించనున్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు. కాగా, పళనిస్వామి.. స్థాపించే పార్టీ పేరు ''అమ్మాడీఎంకే'' అవుతుందని భావిస్తున్నారు. తమిళనాడు ప్రజలు జయలలితను అమ్మగా సంబోధిస్తారు. పార్టీ నాయకులకైతే ఆమె సాక్షాత్తు అమ్మనే. అందుకే తన పార్టీ పేరులో జయలలిత ప్రస్తావన ఉండేలా పన్నీర్ చూస్తారని భావిస్తున్నారు.