Begin typing your search above and press return to search.

తమిళనాట బీజేపీ వ్యూహం : సనాతన ధర్మం వర్సెస్ ద్రవిడవాదం

అన్నా డీఎంకే ఎన్డీయే నుంచి బయటకు రావడం అనూహ్య పరిణామం అయితే కాదు అని అంటున్నారు. తమిళనాడులో ఇపుడు మరోసారి ద్రవిడవాదం ఊపందుకుంటోంది

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:16 AM GMT
తమిళనాట బీజేపీ వ్యూహం :  సనాతన ధర్మం  వర్సెస్ ద్రవిడవాదం
X

అన్నా డీఎంకే ఎన్డీయే నుంచి బయటకు రావడం అనూహ్య పరిణామం అయితే కాదు అని అంటున్నారు. తమిళనాడులో ఇపుడు మరోసారి ద్రవిడవాదం ఊపందుకుంటోంది. చాలా మంది పెద్దలు ఆ వాదం మీదనే రాజకీయ పునాదులు నిర్మించుకుని ఉన్నత స్థానాలకు వెళ్లారు. ఆ మీదట వారు పొత్తుల పేరుతో అసలు ఫిలాసఫీనే పక్కన పెట్టారు.

ద్రవిడవాదం తో పుట్టిన డీఎంకే బీజేపీతో 2001లో పొత్తు పెట్టుకుంది. ఇక అన్నా డీఎంకే గత రెండు ఎన్నికల నుంచి బీజేపీతో ఉంది. బీజేపీ అయితే ద్రవిడవాదానికి వ్యతిరేకం అని తెలుసు. దాన్ని తమిళనాడులో హిందీ పార్టీగా చూస్తారు. హిందీ వ్యతిరేక పార్టీలుగా డీఎంకే, అన్నా డీఎంకే ఉంటాయి.

మరి కమలం పార్టీతో ఎందుకు దోస్తీ చేశారు అంటే అది ఫక్తు రాజకీయ అవకాశ వాదం కిందనే చూస్తారు. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో బలపడాలని అనుకుంటున్న బీజేపీ తానుగా సొంతంగా కూడా పటిష్టం కావాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై భారీ ఎత్తున పాదయాత్ర రాష్ట్రంలో చేస్తున్నారు.

ఆయన పాదయాత్రకు మద్దతు కూడా పెరుగుతోంది. అదే సమయంలో ఆయన డీఎంకేని చీల్చిచెండాడే క్రమంలో ద్రవిడవాదానికి వ్యతిరేకంగా కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామంతో గుస్సా అయిన అన్నాడీఎంకే నేతలు బీజేపీ పొత్తు నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.

ఇక ఇక్కడే ఒక తమాషా ఉంది. అన్నాడీఎంకే బీజేపీ పొత్తు విచ్చిన్నం కావడానికి డీఎంకే వ్యూహం కూడా కారణం అని అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేస్తున్న కామెంట్స్ కూడా బీజేపీని రెచ్చగొట్టి కూటమిలో చిచ్చు పెట్టడానికి కారణం అని అంటునారు. అలా డీఎంకే సనాతన ధర్మం మీద విమర్శలు చేస్తే ద్రవిడవాదం మీద అన్నామలై ఘాటైన విమర్శలు చేస్తూ ఏకంగా మూలాలలోకి వెళ్ళిపోయారు.

ఇది సిద్ధాంతపరంగా జరిగిన ఘర్షణ నుంచి రాజకీయ రచ్చగా మారింది. అదెలా అంటే అన్నాడీఎంకే బలమైన స్థానాలలోనే ఎంచుకుని మరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ ఆయనకు మద్దతు కూడా దక్కుతోంది. ఇక మరో వైపు చూస్తే అన్నాడీఎంకేకు ఈ రోజుకీ సరైన ప్రజాకర్షణ కలిగిన లీడర్ షిప్ లేకపోవడంతో డీఎంకే కి అసలైన ఆల్టర్నేషన్ కావాలని బీజేపీ వేస్తున్న ఎత్తులు కూడా పొత్తు విచ్చిన్నానికి కారణం అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో సనాతన ధర్మం వర్సెస్ ద్రవిడవాదం అన్న దాని మీదనే బీజేపీ వెళ్లాలని చూస్తోఅంది. అన్నాడీఎంకే పక్కకు పోతే మిగిలిన పార్టీలతో కలుపుకుని మూడవ కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. మొత్తానికి బీజేపీకి తమిళనాట సనాతన ధర్మం ఎంతవరకూ చాన్స్ ఇస్తుందో చూడాలి. దీనిని పక్కన పెడితే అన్నాడీఎంకే పొత్తు విచ్చిన్నం కావడం అయితే ఇప్పటికి రాజకీయ దెబ్బే అంటున్నారు.

ఇక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అన్నామలై హిస్టరీ తీసుకుంటే ఈయన ఐపీఎస్ చేసిన మాజీ పోలీసు అధికారి. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2019లో సర్వీసుకు రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరారు. ఆయన ఒక ఐపిఎస్ అధికారిగా కఠినమైన పనితీరుతో పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు.

జాతీయ వాదం, బీజేపీ సిద్ధాంతాలు వంటబట్టించుకున్న ఆయన కమలం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న ఈ యువ నేత అర్ధ శతాబ్దం పై దాటి పునాదులు కూడా గట్టిగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను ఢీ కొంటున్నారు. ఆయనను ముందు పెట్టి బీజేపీ తమిళనాట రాజకీయ జూదం ఆడుతోంది.