Begin typing your search above and press return to search.

తమిళనాడు గవర్నర్ కు సుప్రీం షాక్

ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ రాష్ట్ర గవర్నర్ కు మధ్య అభిప్రాయభేదాలు రావడం సర్వ సాధారణం

By:  Tupaki Desk   |   1 Dec 2023 1:10 PM GMT
తమిళనాడు గవర్నర్ కు సుప్రీం షాక్
X

ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆ రాష్ట్ర గవర్నర్ కు మధ్య అభిప్రాయభేదాలు రావడం సర్వ సాధారణం. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్కడ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ల మధ్య చాలా రోజులు గొడవ నడిచింది. ఇక అదే తరహాలో తమిళనాడు సీఎం స్టాలిన్, తమిళనాడు గవర్నర్ రవిల మధ్య కొంతకాలంగా గ్యాప్ ఉంది. చివరకు తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో సుప్రీంకోర్టు ఆ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన వచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించింది. సీఎం స్టాలిన్ తో కూర్చొని ఆ విషయంపై చర్చ జరిపి పరిష్కరించుకోవాలని గవర్నర్ ఆర్ఎస్ రవికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ముఖ్యమంత్రిని కలిసి ఇద్దరూ కూర్చుని ఆ సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అసెంబ్లీ మరోసారి ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ రిఫర్ చేయడాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వ తరపు న్యాయవాదులు తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా అలా రిజర్వ్ చేయకూడదు అన్న విషయాన్ని గవర్నర్ గమనించాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను డిసెంబర్ 11 కు వాయిదా వేసింది. కొద్దిరోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను గవర్నర్ రవి ఆమోదించకుండా వెనక్కి పంపారు. దీంతో, గవర్నర్ చర్య పై చర్చించేందుకు శనివారం నాడు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోసారి, ఏకగ్రీవంగా శాసనసభలో డీఎంకే సభ్యులు ఆ 10 బిల్లులు ఆమోదించారు. అయితే, వాటిని రాష్ట్రపతికి గవర్నర్ రవి రిఫర్ చేయడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.