Begin typing your search above and press return to search.

2 వాహనాలు.. 1400 కేజీల బంగారం.. ఎవరిది?

ఎందుకంటే.. ఒక లారీలో ఏకంగా వెయ్యి కేజీల బంగారం ఉంటే.. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు

By:  Tupaki Desk   |   15 April 2024 8:30 AM GMT
2 వాహనాలు.. 1400 కేజీల బంగారం.. ఎవరిది?
X

కేజీ బంగారం అంటేనే.. ఒకలాంటి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పది గ్రాముల బంగారాన్ని ఒక సగటు మధ్యతరగతి జీవి కొనేందుకు ముందు వెనుకా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉన్న వేళ.. ఏకంగా 1400 కేజీల బంగారం ఒకేసారి.. రెండు వాహనాల్లో దొరికిస్తే? అంతకు మించిన సంచలనం ఇంకేం ఉంటుంది? ఇప్పుడు అలాంటి షాకింగ్ సీన్ తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తాజాగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా గస్తీ నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ.. మినీ కంటెయినర్ లారీలను సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది.

ఎందుకంటే.. ఒక లారీలో ఏకంగా వెయ్యి కేజీల బంగారం ఉంటే.. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. ఇంత భారీగా బంగారం పట్టుబడటం సంచలనంగా మారింది. ఇంత భారీగా పట్టుబడిన బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవటం గమనార్హం. మొత్తం 1400 కేజీల బంగారానికి కేవలం 400 కేజీల బంగారానికి మాత్రమే అధికారిక పత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూరు సమీపంలోని మన్నార్ లోని ఒక గోదాంకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడటంతో.. చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల్ని పోలీసులు సంప్రదిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇంత భారీగా బంగరాన్ని ఎవరు తెప్పించారు? దీనికి సంబంధించిన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.