కమల్ హాసన్ కు రాజ్యసభ పదవి.. డీఎంకేకు ఒరిగేదేంటి?
అన్ని అంశాల్లో కాకున్నా.. కొన్ని అంశాలు రాజకీయాల్లో చాలా క్లియర్ గా క్లారిటీతో ఉంటాయి. అధినేత స్థాయిలో జరిగే ఒప్పందాలు.. ఇచ్చే హామీలు అమలు పక్కాగా ఉంటుంది.
By: Tupaki Desk | 29 May 2025 9:17 AM ISTఅన్ని అంశాల్లో కాకున్నా.. కొన్ని అంశాలు రాజకీయాల్లో చాలా క్లియర్ గా క్లారిటీతో ఉంటాయి. అధినేత స్థాయిలో జరిగే ఒప్పందాలు.. ఇచ్చే హామీలు అమలు పక్కాగా ఉంటుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విశ్వ కథానాయకుడు కం ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపేందుకు వీలుగా తమిళనాడు అధికార పక్షం డీఎంకే నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్.. ఎం.షణ్ముగమ్.. ఎన్. చంద్రశేగరన్.. ఎం. మహమ్మద్ అబ్దుల్లా.. పి. విల్సన్.. వైగోల రాజ్యసభ పదవీ కాలం జులై 25తో ముగియనుంది.
వీరి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. ఆ మధ్య జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల బలాన్నిచూస్తే డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో.. ఈ పార్టీ తరఫున నలుగురు రాజ్యసభ సభ్యత్వాన్ని పొందే వీలుంది. అదే సమయంలో అన్నా డీఎంకేకు ఒక సభ్యుడ్ని రాజ్యసభకు పంపే వీలుంది. ఒకవేళ మిగిలిన మరో స్థానాన్ని సొంతం చేసుకొని తమ సభ్యుడ్ని రాజ్యసభకు ఎంపిక అయ్యేలా చేయలంటూ బీజేపీ.. పీఎంకే ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అన్నాడీఎంకే బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది (2026) ఏప్రిల్ - మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా రాజ్యసభకు పంపే వారి నియామకం మొత్తం కూడా సదరు ఎన్నికలను సైతం పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయటం ఖాయం. కమల్ హాసన్ ఎంపిక కూడా ఆ కోవకు చెందిందే. గత ఏడాది లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే.. కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ పార్టీ మద్దతు పలకటం.. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 ఎంపీ స్థానాలతో పాటు.. పుదుచ్చేరిలోని ఒక స్థానం తరఫున పోటీ చేసే మిత్రపక్షం అభ్యర్థుల తరఫున ప్రచారం చేయటం తెలిసిందే.
ఇందుకు బదులుగా రాజ్యసభ సభ్యత్వాన్ని కమల్ హాసన్ కు కట్టబెట్టేందుకు వీలుగా డీఎంకే అధినేత.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజ్యసభకు కమల్ హాసన్ వెళ్లటం లాంఛనంగా మాత్రమే మారిందని చెప్పాలి.ఇదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడే రాజకీయ సమీకరణాలు స్పష్టమయ్యాయని చెప్పాలి.
రాజ్యసభకు కమల్ హాసన్ ఎంపిక నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే.. కాంగ్రెస్ తో పాటు కమల్ హాసన్ పార్టీలు కలిసి కూటమిగా మారనున్న విషయం క్లియర్ అయ్యిందని చెప్పాలి.అదే సమయంలో విపక్ష అన్నాడీఎంకే.. బీజేపీతో పాటు సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) కలిసి కూటమిగా ఏర్పడే అవకాశాల్ని మరింత పెంచిందన్న మాట వినిపిస్తోంది. కమల్ హాసన్ ఎంపికతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరు జత కలుస్తారన్న దానిపై స్పష్టత వచ్చినట్లేనని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాలిన్ పాలనపై తమిళ ప్రజలు పెద్ద సంతోషంగా లేరన్న మాట వినిపిస్తోంది. రాబోయే ఏడాది వ్యవధిలో ఈ వాదన బలహీనం కాని పక్షంలో డీఎంకే కూటమికి మైనస్ అవుతుందని చెబుతున్నారు. కమల్ హాసన్ ఎంపికతో అన్నాడీఎంకే.. బీజేపీ బంధం బలపడటమే కాదు.. టీవీకే కూడా వారితో చేతులు కలిపిన పక్షంలో అనూహ్య పరిణామాలు ఏర్పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
