ఈసారి గెలిస్తే స్టాలిన్ హీరోనే !
ఇక తమిళనాడునే గెలుచుకోవాలన్నది బీజేపీ మార్క్ వ్యూహం. దాని కోసం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది.
By: Tupaki Desk | 17 April 2025 8:15 AM ISTదేశంలో ఆసక్తికరమైన పోరు ఈసారి తమిళనాడులో జరగనుంది. మొదటిసారి బీజేపీ దక్షిణాది మీద గురి పెట్టింది. దానికి గేట్ వేగా తమిళనాడుని చేసుకుంటోంది. తమిళనాడులో ద్రవిడ పార్టీల మీద గెలిస్తే ఇక తిరుగేలేదని కూడా భావిస్తోంది. ఎందుచేతనటే తమిళనాడు అనంది రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం.
అక్కడ కనుక జెండా పాతితే బీజేపీకి ఎదురు ఉండదు. కర్ణాటక ఎటూ బీజేపీకి అధికారం ఇస్తూ వస్తోంది. తెలంగాణాలో ఇపుడిపుడే బలపడుతోంది. ఏపీలో టీడీపీ జనసేనలతో కలసి కూటమి కట్టింది. అక్కడ మెల్లగా పాగా వేయడానికి మార్గాలు వెతుకుతోంది.
ఇక తమిళనాడునే గెలుచుకోవాలన్నది బీజేపీ మార్క్ వ్యూహం. దాని కోసం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఒక విధంగా బీజేపీకి గ్రౌండ్ లెవెల్ లో కష్టాలు తీరినట్లే. అన్నా డీఎంకేకు క్షేత్ర స్థాయిలో బలం బలగం దండీగా ఉన్నాయి. పై స్థాయిలో అండగా ఉంటూ బేజేపీ ఆశీర్వదిస్తే ఏపీ మాదిరిగా తమిళనాడులో గెలుపు సాధ్యమే అన్నది ఒక ఆలోచనగా ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడు నుంచే బీజేపీకే పదునైన రాజకీయ సవాల్ ఎదురైంది. అది కూడా డీఎంకే అధినేత స్టాలిన్ రూపంలో. కరుణానిధి వారసుడిగా వచ్చిన స్టాలిన్ ఇంతలోనే జాతీయ రాజకీయల్లో కీలకం అవుతారని ఎవరూ అనుకోలేదు. బీజేపీ అంతలా ఊహించలేదు కూడా.
కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. స్టాలిన్ కేవలం తమిళనాడుకే పరిమితం కావడం లేదు. సౌత్ స్టేట్స్ ని ఆయన ఏకం చేస్తున్నారు. ఇటీవలనే ఆయన డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో రాజకీయ పార్టీల నేతలతో కీలక మీటింగ్ నిర్వహించారు. ఒక రకంగా బీజేపీకి పెను సవాల్ చేశారు.
బీజేపీ దక్షిణాది ఆశలకు తొలి చెక్ పెట్టాలని చూశారు. దాంతోనే బీజేపీ చలా మెట్లు దిగి వచ్చి మరీ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఆరు నూరు అయినా స్టాలిన్ అధికారంలోకి మళ్ళీ రాకూడదన్నది బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది.
దాని కోసం తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. అయితే స్టాలిన్ కాంగ్రెస్ వామపక్షాలు ఇతర పార్టీలతో కలసి కూటమిగా వస్తున్నారు. ఆయన కేంద్రం మీద పోరాడే యోధుడిగా ఇప్పటికే తమిళ ప్రజలకు చేరువ అయ్యారు. ద్రవిడ వాదానికి కేంద్ర బిందువుగా ఆయన ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
సౌత్ నుంచి మోడీని ఢీ కొట్టే రాజకీయ నేతగా ఆయన తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కలసి ఆయన అవకాశాలను ఎన్నికల్లో ఏ మేరకు పెంచుతాయో చూడాలి. అయిదేళ్ళ పాలన మీద ఎంతో కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అయితే దానితో పాటుగా మోడీ వర్సెస్ స్టాలిన్ అన్నట్లుగా పిక్చర్ ని కనుక జనంలోకి బలంగా పంపితే అది అంతిమంగా స్టాలిన్ కి ప్లస్ అవుతుంది అని అంటున్నారు. ఈసారి కనుక స్టాలిన్ గెలిచి మళ్ళీ సీఎం అయితే ఆయన హీరో అవడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభ పూర్తి స్థాయిలో వెలగడం ఖాయమని కూడా అంటున్నారు.
