గవర్నర్ సంతకం లేకుండానే చట్టం.. దేశంలోనే తొలిసారి..
తమిళనాడు ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకున్న గవర్నర్ ఆర్ఎన్ రవికి షాకిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలసిందే.
By: Tupaki Desk | 13 April 2025 4:45 AMగవర్నర్, రాష్ట్రపతి సంతకం చేస్తేనే చట్టం.. మన దేశంలో అమలు అవుతున్న రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు చట్టాలు అవ్వాలంటే సంబంధిత గవర్నర్ లేదా రాష్ట్రపతి సంతకం చేయాల్సిందే.. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలోనే తొలిసారిగా గవర్నర్ సంతకం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం పది చట్టాలకు ఆమోదముద్ర వేసింది. తమిళనాడు గవర్నర్, స్టాలిన్ ప్రభుత్వం మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు విడుదల చేసిన సంచలన తీర్పు ఫలితంగా గవర్నర్ సంతకం లేకుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం పది చట్టాలను చేసిన శనివారం గెజిట్ విడుదల చేసింది. దేశంలోనే తొలిసారిగా చెబుతున్న ఈ అంశంపై హాట్ డిబేట్ జరుగుతోంది.
తమిళనాడు ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకున్న గవర్నర్ ఆర్ఎన్ రవికి షాకిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలసిందే. సుదీర్ఘకాలంగా పది బిల్లులను పెండింగులో పెట్టడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ వ్యవస్థ నిమిత్తమాత్రమేనని పేర్కొంటూ గవర్నర్ సంతకం లేకపోయినా చట్టాలు చేయొచ్చని తీర్పు చెప్పింది. గవర్నర్ రవి పెండింగులో పెట్టిన బిల్లులు 2023 నవంబరు 18 నుంచే చట్టం కింద పరిగణిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ సంతకం చేయని బిల్లులు చట్టాలుగా పేర్కొంటూ గెజిట్ విడుదల చేసింది.
సుప్రీంతీర్పు కాపీ వెబ్ సైటులో అప్ లోడ్ అయిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం గెజిట్ వెలువరించడం విశేషంగా చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం తమిళనాడులోని యూనివర్సిటీలు అన్నింటికి ఇకపై ముఖ్యమంత్రి చాన్సలర్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మన దేశంలో యూనివర్సిటీలకు చాన్సలర్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. అయితే వైస్ చాన్సలర్లు, ఇతర కీలక పోస్టుల నియామకాల్లో ప్రభుత్వానికి సహకరించకుండా కొంతమంది కొర్రీలు వేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీ పాలక మండళ్లలో గవర్నర్ పాత్ర లేకుండా చేయాలని భావిస్తున్నాయి. ఇదే విధంగా తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ను తప్పించాలని చూసింది. అయితే ఈ బిల్లుకు గవర్నర్ మొకాలడ్డటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. విచారణ అనంతరం సుప్రీం సంచలన తీర్పు ఇవ్వడంతో తమిళనాడు ప్రభుత్వ పంతం నెగ్గినట్లైంది.
తమిళనాడు గవర్నర్ గా 2021లో బాధ్యతలు స్వీకరించిన రవి తొలి నుంచి ప్రభుత్వంతో ఘర్షణాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఆమోదించి గవర్నర్ సంతకం కోసం పంపింది. అయితే మూడేళ్లుగా సంతకాలు చేయకుండా గవర్నర్ సతాయించడంతో కోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. శాసనసభ ఆమోదించిన బిల్లలును గవర్నర్ తన వద్దే అట్టిపెట్టుకోవడం చట్ట విరుద్ధమైన చర్యగా భావించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ గవర్నర్ వెనక్కి పంపాలని, లేదంటే నెల రోజుల్లో ఆమోదించాల్సివుంటుందని పేర్కొంది. కానీ, ఏ విషయం తెలియపరచకుండా మూడేళ్లుగా గవర్నర్ పది బిల్లులను పెండింగ్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.