Begin typing your search above and press return to search.

గవర్నర్ రాజీనామా.. తమిళనాడులో అక్కడినుంచే పోటీ

కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి.. లేదు లేదు అంటున్నా.. చివరకు అదే నిర్ణయం తీసుకున్నారు

By:  Tupaki Desk   |   18 March 2024 7:00 AM GMT
గవర్నర్ రాజీనామా.. తమిళనాడులో అక్కడినుంచే పోటీ
X

కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి.. లేదు లేదు అంటున్నా.. చివరకు అదే నిర్ణయం తీసుకున్నారు. వైద్యురాలిగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోంచి రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన ఆమె.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఈసారి బీజేపీ హ్యాట్రిక్ కొడితే కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉండడంతో ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడత కొలువు దీరిన కొద్ది రోజులకు, గత లోక్ సభ ఎన్నికలు పూర్తయిన నాలుగు నెలలకు.. 2019 సెప్టెంబరు 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు తమిళిసై. మాజీ ఐపీఎస్ కిరణ్ బేదీని తప్పించడంతో తమిళిసైకి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గానూ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా తమిళిసై బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ పదవికి ముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలే. ఇప్పుడు మళ్లీ లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే పదవి వీడినట్లు సమాచారం.

రాష్ట్రపతికి రాజీనామా

తమిళిసై తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ చేశారు. తమిళిసై చెన్నై సెంట్రల్ నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. వాస్తవానికి మూడు నెలల నుంచి గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ తోనూ చర్చిస్తూ వస్తున్నారు. సమయం కోసం వేచి ఉన్నారు.

ఒక్కసారీ నెగ్గలేదు..

తమిళిసై పలుసార్లు అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేసినా ఒక్కసారీ నెగ్గలేదు. 2009లో చెన్నై నార్త్ నుంచి డీఎంకే అభ్యర్థి ఇలంగోవన్ చేతిలో ఓడారు. 2019లో తూత్తుకూడిలో డీఎంకే అగ్రనేత కరుణానిధి కుమార్తె కనిమొళి చేతిలో పరాజయం పాలయ్యారు. 2006 (రాధాపురం), 2011 (వేలచేరి), 2016 (విరుగంపాక్కం)లో అసెంబ్లీకి పోటీ చేసినా ఓటమి తప్పలేదు.

తొలి మహిళా గవర్నర్.. మలి విడత బీఆర్ఎస్ కు చుక్కలు

తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా వచ్చిన తమిళిసై.. రెండో విడత బీఆర్ఎస్ సర్కారుకు చుక్కుల చూపారు. పలు బిల్లులపై తన సందేహాలను వ్యక్తం చేయడమే కాక ఆమోదించకుండా ఆపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్నీ ఆమోదించలేదు.

కొసమెరుపు: తమిళిసై 1961 జూన్ 2న జన్మించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి రెండో గవర్నర్ గా, తొలి మహిళా గవర్నర్ గా వచ్చారు. ఆమెకు గవర్నర్ గిరీ ఇదే తొలిసారి. అంతేకాక.. తమిళనాడు, తెలంగాణ పేర్లు ఆంగ్ల అక్షరం ‘టి’తోనే మొదలవుతాయి.