Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఓకే... ఈ క్రెడిట్ త‌మ‌దేనంటున్న బీజేపీ!

ఈ ముసాయిదా బిల్లును ఆమె ఓకే చేస్తారా? చేయ‌రా? అనే టెన్ష‌న్ అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కు దారి తీసింది

By:  Tupaki Desk   |   14 Sep 2023 8:12 AM GMT
ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఓకే... ఈ క్రెడిట్ త‌మ‌దేనంటున్న బీజేపీ!
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్లు, ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తూ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం నూత‌నంగా తీసుకువ‌చ్చిన ఆర్టీసీ బిల్లు - 2023కు గవర్నర్ తమిళిసై ప‌చ్చ జెండా ఊపారు. వాస్త‌వానికి ఈ బిల్లు ముసాయిదా విష‌యంలోనే అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు, చ‌ర్చ‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్‌... అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టేందుకు మునుపే.. స‌ర్కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించారు.

ఈ ముసాయిదా బిల్లును ఆమె ఓకే చేస్తారా? చేయ‌రా? అనే టెన్ష‌న్ అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కు దారి తీసింది. అయితే, ఎట్ట‌కేల‌కు ఈ ముసాయిదా బిల్లుకు ఓకే చెప్ప‌డం, ఆ వెంట‌నే స‌భ‌లో స‌ర్కారు దీనిని ఆమోదించుకోవ‌డం ద‌రిమిలా.. ఇప్పుడు తాజాగా బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ప‌చ్చ జెండా ఊప‌డంతో ఇది చ‌ట్టంగా మారి... ఆర్టీసీ ఉద్యోగుల‌ను.. స‌ర్కారీ ఉద్యోగులుగా మార్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

అయితే.. ఈ బిల్లు ఆమోదం విష‌యంపై కీల‌క‌మైన రెండు పార్టీలు రాజ‌కీయానికి తెర‌దీశాయి. అధికార పార్టీ బీఆర్ ఎస్‌.. ఈ బిల్లును తీసుకురావ‌డం ద్వారా సుమారు 2 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌కు మేలు చేశామని, కొన్ని ద‌శాబ్దాల క‌ల‌ను నెర‌వేర్చామ‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తూ.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధిని ఆశిస్తోంది. అదేస‌మ‌యంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన ద‌రిమిలా.. ప్ర‌తిప‌క్షం బీజేపీ కూడా ఈ క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్లుకు బీజేపీ నాయ‌కురాలు అయిన గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపార‌ని, ఆమె సంత‌కం పెట్టారు కాబ‌ట్టే ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌కు మేలు జ‌రిగింద‌ని బీజేపీ నాయ‌కులు అప్పుడే ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీకారం చుట్టేశారు. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆర్టీసీ కార్మికులు సదా రుణపడి ఉంటారని, అదేవిధంగా బీజేపీకి కూడా వారు బ‌ద్ధులై ఉండాల‌ని క‌మ‌లం పార్టీ నాయ‌కులు ట్విట్ట‌ర్ వేదిక‌గా అప్పుడే వ్యాఖ్యానాలు ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బిల్లు క్రెడిట్ ఎవ‌రికి ద‌క్కుతుంది? కీల‌క‌మైన ఎన్నిక‌ల ముంగిట‌.. ఈ బిల్లు ఏమేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.