Begin typing your search above and press return to search.

సున్నిత‌మైన అంశంపై గ‌వ‌ర్న‌ర్ ఓవ‌ర్ చేస్తున్నారా? నెటిజ‌న్ల కామెంట్లు.. ఏం జ‌రిగింది?

గ‌వ‌ర్న‌ర్ ఏం చేశారంటే..అయితే, సున్నిత‌మైన ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వెంట‌నే జోక్యం చేసుకున్నారు. ఇదే విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 2:59 PM GMT
సున్నిత‌మైన అంశంపై గ‌వ‌ర్న‌ర్ ఓవ‌ర్ చేస్తున్నారా?  నెటిజ‌న్ల కామెంట్లు.. ఏం జ‌రిగింది?
X

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి, రాష్ట్ర బీఆర్ ఎస్ స‌ర్కారుకు మ‌ధ్య వివాదాలు, విభేదాలు.. మాట‌ల తూటాలు అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో ఏం జ‌రిగినా.. నెటిజ‌న్ల నుంచి పెద్ద‌గా ప్ర‌తిస్పంద‌న లేదు. కానీ, తాజాగా గ‌వ‌ర్న‌ర్ చేసిన ఆదేశం, వ్య‌వ‌హ‌రించిన తీరుపై మాత్రం నెటిజ‌న్లు ఒకింత పెద‌వి విరుస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఓవ‌ర్ చేస్తున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. కీల‌కమైన ఎన్నిక‌ల‌ముంగిట బీఆర్ ఎస్ స‌ర్కారును అప‌ఖ్యాతి పాల్జేసేందుకు.. ప్ర‌య‌త్నిస్తున్నార‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా దుయ్య‌బ‌డుతున్నారు.

ఏం జ‌రిగింది? గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్న విష‌యం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. చిక్క‌డ‌ప‌ల్లిలోని అశోక్‌న‌గ‌ర్‌లో ఓ హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుతున్నప్రవల్లిక .. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌పై కాంగ్రెస్‌, బీజేపీలుతీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వెంట‌నే ఆందోళ‌న‌ల‌కు కూడా పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్టారు. ఆమెది ఆత్మ‌హ‌త్యేన‌ని తేల్చారు. ఇదే విష‌యాన్ని సెంట్ర‌ల్ జోన్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు కూడా నిర్ధారించారు.

ప్రవల్లిక ఆత్మహత్య తరువాత ఆమె సెల్ ఫోన్‌లో వాట్సప్ చాటింగ్‌ను చెక్ చేశామ‌న్నారు. పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి ప్రేమ‌లోకి దింపిన‌ శివరామ్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని, దీంతో మ‌న‌స్తాపానికి గురైన ప్ర‌వ‌ల్లిక ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌న్నారు. ఆమె మరణానికి ముందు వాట్సప్‌లో తన స్నేహితులతో ఈ బాధను పంచుకుంద‌న్నారు. షాట్స్ యాప్ చాటింగ్ ఆమె ఆత్మహత్యకు కారణాన్ని స్పష్టంగా నిర్ధారిస్తుందన్నారు. సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామ‌ని కూడా చెప్పారు.

గ‌వ‌ర్న‌ర్ ఏం చేశారంటే..అయితే, సున్నిత‌మైన ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వెంట‌నే జోక్యం చేసుకున్నారు. ఇదే విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఒక మ‌హిళ‌గా ఆమెకు ఆవేద‌న ఉంటే ఉండొచ్చు. కానీ, శాంతి భ‌ద్ర‌త‌ల అంశ‌మైన‌.. దీనిపై త‌క్ష‌ణ‌మే ఆమె రియాక్ట్ కావ‌డం, అధికారుల‌ను ఆదేశించ‌డం వంటివి వివాదానికి దారితీశాయి.

ప్ర‌వ‌ల్లిక మృతిపై త‌న‌కు 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని గ‌వ‌ర్న‌ర్‌ ఆదేశించారు. నిరుద్యోగ యువతి, యువకులు అధైర్య పడొద్దని గవర్నర్ సూచించారు. అయితే.. ఎన్నిక‌ల స‌మయంలో సంయ‌మనం పాటించాల్సిన గ‌వ‌ర్న‌ర్ ఇలా.. దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.