20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు..
డిజిటల్ యుగంలో విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాదు. ఒకప్పుడు బ్లాక్ బోర్డు, చాక్‌తో మొదలైన విద్యా ప్రయాణం.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, ఏఐ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ స్కిల్స్ దాకా వచ్చి చేరింది.
By: Tupaki Desk | 18 Jan 2026 2:26 PM ISTడిజిటల్ యుగంలో విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాదు. ఒకప్పుడు బ్లాక్ బోర్డు, చాక్‌తో మొదలైన విద్యా ప్రయాణం.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, ఏఐ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ స్కిల్స్ దాకా వచ్చి చేరింది. మారుతున్న కాలాన్ని ముందుగానే అర్థం చేసుకొని, విద్యార్థుల చేతుల్లోకి భవిష్యత్తును అప్పగించే ప్రయత్నమే తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ‘ఉలగం ఉంగల్ కైయిల్ (ప్రపంచం మీ చేతుల్లో ఉంది)’ పథకం. పేరు వినగానే ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదని, ఒక ఆలోచన అని అర్థమవుతుంది. ప్రపంచంతో పోటీ పడే సామర్థ్యం విద్యార్థుల్లో పెరగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
తొలివిడుతలో 20 లక్షల మందికి
తాజాగా ఈ పథకం కింద తొలి విడతగా ఏకంగా 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇది కేవలం సంఖ్యల పరంగా పెద్ద విషయం కాదు.. దాని వెనుక ఉన్న విజన్ మరింత కీలకం. ఎం.కే. స్టాలిన్ స్పష్టంగా చెప్పిన మాట ఒక్కటే ‘ఇది ఉచిత బహుమతి కాదు, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడి’ విద్యార్థులు డిగ్రీలు సంపాదించడమే కాకుండా, ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌ను కూడా సొంతం చేసుకోవాలన్నదే ఈ పథకపు ప్రధాన ఉద్దేశం. ఈ ల్యాప్‌టాప్‌ల పంపిణీ కూడా సాధారణంగా జరగలేదు. డెల్, లెనోవో, ఏసర్, హెచ్‌పీ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను ఎంపిక చేశారు. అంటే ‘ఉచితం కాబట్టి ఏదో ఒకటి’ అన్న ధోరణి కాదు. విద్యార్థులు రోజువారీ ఉపయోగం, ప్రోగ్రామింగ్, డిజిటల్ డిజైన్, డేటా అనాలిసిస్ వంటి పనులు చేయగలిగే స్థాయి హార్డ్‌వేర్‌ను అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ విధానాల్లో అరుదుగా కనిపించే క్వాలిటీ ఫోకస్‌కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఉచిత ఏఐ కూడా..
ఇంకా ముఖ్యమైన అంశం.. ఈ ల్యాప్‌టాప్‌లతో పాటు ఆరు నెలల పాటు ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా అందించడం. ఇది ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశం. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చుట్టూనే తిరుగుతోంది. రేపటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశోధనలు అన్నీ ఏఐ స్కిల్స్‌తోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి సమయంలో గ్రామీణ, పట్టణ విద్యార్థుల మధ్య ఉన్న డిజిటల్ గ్యాప్‌ను తగ్గించడానికి ఇది కీలక అడుగు. తమిళనాడు ఇప్పటికే విద్య, సామాజిక న్యాయం, మానవ వనరుల అభివృద్ధి విషయంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ ల్యాప్‌టాప్ పథకం కూడా అదే కొనసాగింపుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి తరం విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల జీవితాన్ని మలుపుతిప్పే అవకాశం.
ల్యాపులతో విద్యార్థులకు మరింత విద్య..
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. చాలా సార్లు సంక్షేమ పథకాలు ఎన్నికల కోణంతోనే చూస్తారు. కానీ ఈ పథకం ఫలితం ఐదేళ్లలో కనిపించదు. 10, 15 ఏళ్ల తర్వాతే అసలైన ప్రభావం కనిపిస్తుంది. అప్పటికి ఈ రోజు ల్యాప్‌టాప్ తీసుకున్న విద్యార్థుల్లో కొందరు స్టార్టప్ వ్యవస్థాపకులుగా, కొందరు ఏఐ ఇంజినీర్లుగా, మరికొందరు గ్లోబల్ కంపెనీల్లో కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది. అంటే ఇది ఓట్ల కోసం కాదు, తరాల కోసం చేసిన పెట్టుబడి. అయితే ఇలాంటి పథకాల విజయానికి మరో కీలక అంశం అమలు. ల్యాప్‌టాప్‌లు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. వాటిని ఎలా ఉపయోగించాలో మార్గనిర్దేశం, కంటెంట్ నాణ్యత, ఇంటర్నెట్ యాక్సెస్ వంటి అంశాలు కూడా సమాంతరంగా బలోపేతం కావాలి. ప్రభుత్వం ఈ దిశగా కూడా అడుగులు వేస్తే, “ఉలగం ఉంగల్ కైయిల్” అనే నినాదం నిజంగానే అక్షరాలా నిజమవుతుంది.
ఈ పథకం స్పష్టమైన సందేశం ఇస్తోంది భవిష్యత్తు పేదరికాన్ని తుంచాలంటే సబ్సిడీలు కాదు స్కిల్స్ అవసరం. ప్రపంచం మీ చేతుల్లో ఉండాలంటే, ఆ చేతుల్లో సరైన సాధనాలు ఉండాలి. తమిళనాడు చేసిన ఈ ప్రయోగం.. మిగతా రాష్ట్రాలకు కూడా ఒక మోడల్‌గా మారుతుందా? అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.
