గుళ్లకు వచ్చిన వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం
ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. తమిళనాడులోని కొన్ని దేవాలయాలకు భక్తులు సమర్పించే బంగారు కానుకల్ని పోగేసి.. ఆ మొత్తాన్ని కరిగించిన వైనం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 18 April 2025 10:04 AM ISTఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. తమిళనాడులోని కొన్ని దేవాలయాలకు భక్తులు సమర్పించే బంగారు కానుకల్ని పోగేసి.. ఆ మొత్తాన్ని కరిగించిన వైనం వెలుగు చూసింది. తమిళనాడులోని 21 ఆలయాలకు భక్తులు భారీగా బంగారాన్ని సమర్పింస్తుంటారు. తాజాగా ఆ దేవాలయాలకు చెందిన వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది స్టాలిన్ ప్రభుత్వం.
దేవాలయాలకు భక్తులు ఇచ్చిన బంగారాన్ని కరిగించి.. 24 క్యారట్ల కడ్డీలుగా మార్చినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ బంగారు కడ్డీలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లుగా వెల్లడించింది. దీని ద్వారా ప్రతి ఏడాది రూ.17.81 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఇలా వచ్చే ఆదాయాన్ని సదరు ఆలయాల కోసమే వెచ్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. హిందూమత.. దేవాదాయ శాఖకు సంబంధించిన విధానపరమైన పత్రాన్ని మంత్రి శేఖర్ బాబు తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
మొత్తం 21 ఆలయాల్లో అత్యధికంగా తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మరిఅమ్మన్ ఆలయం నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఆలయం నుంచి 424 కేజీల బంగారం రాగా.. ఇతర గుళ్ల నుంచి భారీగానే బంగారాన్ని సమకూర్చారు. అంతేకాదు హెచ్ ఆర్ అండ్ సీఈ శాఖ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న వెండి వస్తువుల్ని కూడా కరిగించేందుకు అమనుతి ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇక.. ఇంత భారీగా బంగారాన్ని కరిగించి..కడ్డీల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వైనాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకుచెందిన ముగ్గురు రిటైర్డు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన వైనాన్ని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీగా బంగారాన్ని కడ్డీల రూపంలో మార్చి.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం బాగానే ఉన్నా.. రానున్న రోజుల్లో ఆ బంగారాన్ని అంతే సేఫ్ గా ఉంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
