స్టాలిన్ గద్దె దిగాల్సిందే: విజయ్ పార్టీని టచ్ చేస్తున్న బీజేపీ?
తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. అక్కడ బీజేపీ స్టాలిన్ ని ఎలాగైనా గద్దె నుంచి దించేయాలని కంకణం కట్టుకుంది.
By: Tupaki Desk | 22 April 2025 12:00 PM ISTతమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. అక్కడ బీజేపీ స్టాలిన్ ని ఎలాగైనా గద్దె నుంచి దించేయాలని కంకణం కట్టుకుంది. మామూలుగా అయితే స్టాలిన్ మరోసారి సీఎం అయితే ఓకే. కానీ అలా జరగడం లేదు. ఆయన సౌత్ ఇండియా నార్త్ ఇండియా నినాదం అందుకున్నారు. సౌత్ ఇండియా రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్నారు.
ఇక వారికి ఒక దారి చూపిస్తున్నట్లుగా తమిళనాడుకు స్వయం ప్రతిపత్తిని కోరుతున్నారు. దీని కోసం ఒక కమిటీని వేశారు. హిందీ వద్దు అని తమిళనాడులో ఆయన అంటే అది కాస్తా మహారాష్ట్రకు పాకింది. డీలిమిటేషన్ వ్యవహారం చాకచక్యంగా చేయాలని చూసిన బీజేపీకి స్టాలిన్ దెబ్బ మరో విధంగా రుచి చూపించింది.
ఇలా కంట్లో నలుసుగా మారిన స్టాలిన్ కేవలం ఒకసారి సీఎం అయ్యారు. మరి అయిదేళ్ళకే ఇంత చేస్తే మరో అయిదేళ్ళకు అధికారం ఇస్తే ఇంతకు ఇంతా చేస్తారు అని బీజేపీ పెద్దలు కంగారు పడుతున్నారని అంటున్నారు. అంతే కాదు బీజేపీ దక్షిణాది ఆశలకు స్టాలిన్ అడ్డు చక్రం వేసి నీరు కారుస్తున్నారు అన్న ఆవేదన ఆగ్రహం కూడా ఉన్నాయి.
దీంతో తమిళనాడులో ఎన్నడూ చేయని రాజకీయ ప్రయోగాలకు బీజేపీ సిద్ధపడుతోంది. ఈ నెలలో తమిళనాడుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నా డీఎంకేతో పొత్తు ప్రకటించారు. దాంతో స్టాలిన్ మీద రాజకీయ యుద్ధం బలంగానే చేస్తామని కమలం సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఇపుడు దానికి తోడు అన్నట్లుగా తమిళ దళపతి వెండి తెర పవర్ ఫుల్ స్టార్ అయిన దళపతి విజయ్ పార్టీని కూడా ఆకర్షించేందుకు చూస్తోంది.
తాజా సర్వేలు అన్నీ విజయ్ పార్టీకి మంచి ఓటింగ్ వస్తుందని చెబుతున్నాయి. యూత్ అంతా ఆయన వైపు ఉన్నారని మహిళాదరణ బాగా ఉందని నివేదికలు వస్తున్నాయి. విజయ్ పార్టీ బరిలో ఉంటే త్రిముఖ పోరు సాగి మరోసారి స్టాలిన్ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. పైగా ఆయన చీల్చే ఓట్లు ఎక్కువగా అన్నా డీఎంకే వే అని అంటున్నారు.
దాంతో ఆయనను ఎలాగైనా ఎండీయే కూటమిలోకి కలుపుకోవాలని బీజేపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే విజయ్ తన పార్టీని ప్రజలలో పరిచయం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆరేడు నెలల పాటు ఆయన తమిళనాడు అంతా తిరిగి తన పార్టీని బలోపేతం చేస్తారు అని అంటున్నారు.
ఇక డిసెంబర్ నాటికి ఆయన పొత్తుల విషయంలో ఆలోచిస్తారు అని అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయ్ పార్టీని వదిలిపెట్టరాదు అని నిర్ణయించుకుంది అని అంటున్నారు. అవసరం అయితే సీఎం అభ్యర్ధిగా ఆయననే ప్రకటించి మరీ ముందుకు సాగాలని చూస్తోంది.
మరి కొత్త సీఎం గా విజయ్ పేరుని ప్రకటించి బీజేపీ అన్నా డీఎంకే ఆయనతో కలసి సాగితే కనుక అది కచితంగా డీఎంకేకి భారీ దెబ్బ అని అంటున్నారు. ఎందుకంటే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ కి కేంద్రంలోని బీజేపీ సహకారం, అలాగే అన్నాడీఎంకే పార్టీ సంస్థాగత బలం కలిస్తే కనుక కచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విజయ్ నిర్ణయమే తమిళనాడు రాజకీయాలను శాసిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.
