ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలకు ‘భాష’ ఫిక్స్.. సర్కార్ సంచలన నిర్ణయం!
ఈ సమయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 17 April 2025 2:44 PM ISTరాష్ట్ర స్థానిక భాషతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా, మెజారిటీ ప్రభుత్వ ఉత్తర్వులను చూసినా అవన్నీ గరిష్టంగా ఇంగ్లిష్ భాషలోనే ఉంటున్న సంగతి తెలిసిందే! ఇక ప్రభుత్వాల నుంచి వచ్చే నోటీసులు, ప్రభుత్వాధికారుల వివరాలు సైతం ఇంగ్లిష్ లోనే ఉంటున్నాయి! ఈ సమయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పైగా 2026లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వివాదం మరింతగా చినికి చినికి గాలివానగా మారుతోందని అంటున్నారు. దీంతో... స్టాలిన్ సర్కార్ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు వెళ్తోంది.
ఇందులో భాగంగా... ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించి.. ఆ స్థానంలో "రూ" అనే అర్ధం వచ్చేలా తమిళ అక్షరాన్ని చేర్చారు. ఈ నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. స్టాలిన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి.
ఈ నేపథ్యంలో మరిన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొంటోంది స్టాలిన్ సర్కార్. ఇందులో భాగంగా.. ఇప్పటికే వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు మొదలైన వాటి బోర్డులు తమిళ భాషలోనే ఉండాలని సూచించింది. అలాకానిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇందులో భాగంగా... ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా వారి వారి సంతకాలను తమిళ భాషలోనే పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదే క్రమంలో... ప్రభుత్వ ఉత్తర్వ్యులను కూడా తమిళంలోనే ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసిన స్టాలిన్ సర్కార్.. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని సర్క్యులర్స్ కూడా తమిళంలోనే ఉండాలని.. ఇంగ్లిష్ భాషలో వచ్చిన సర్క్యులర్స్ లను తమిళంలోకి ట్రాన్స్ లేట్ చేయాలని పేర్కొంది.
కాగా... 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో... అధికారం డీఎంకే, బీజేపీ మధ్య భాష వివాదం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో.. ఇటీవల తమిళనాడు పర్యటనలో భాగంగా రామేశ్వరంలోని పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... డీఎంకే నేతలు ఎవరూ తనకు రాసే లేఖల్లో తమిళంలో సంతకాలు చేయరని అంటూ.. తమిళ భాష పట్ల మీకు నిజంగా గౌరవం ఉంటే ఆ భాషలోనే సంతకం చేయడం నేర్చుకోవాలని విమర్శించారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది!
