హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ.. 118 సీట్లు వస్తేనే విజయ్ సీఎం
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్విధ్రువ రాజకీయాలకు కాలం చెల్లిందా? డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే సాగే అధికారం ఆటలో మూడో శక్తికి తావులేదన్న వాదనను విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పటాపంచలు చేస్తోంది.
By: Tupaki Desk | 4 May 2026 11:05 AM ISTతమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్విధ్రువ రాజకీయాలకు కాలం చెల్లిందా? డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే సాగే అధికారం ఆటలో మూడో శక్తికి తావులేదన్న వాదనను విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పటాపంచలు చేస్తోంది. అయితే టీవీకే మ్యాజిక్ మార్క్ 118 సీట్లకు కొద్దిదూరంలో టీవీకే నిలిచిపోతోంది. దీంతో హంగ్ ఏర్పడనుంది. టీవీకే ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్నది కీలకంగా మారింది. తాజా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సరళిని గమనిస్తే తమిళనాడు ఒక చారిత్రాత్మక మలుపు వద్ద నిలబడిందని స్పష్టమవుతోంది.
అంచనాలను మించిన ఆధిపత్యం
ఎన్నికల బరిలోకి దిగుతూనే "తమిళనాడు నా కుటుంబం" అని ప్రకటించిన విజయ్.. కేవలం సినీ గ్లామర్‌తోనే కాకుండా పక్కా రాజకీయ వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లారని ఫలితాలు చెబుతున్నాయి. 100కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో ఉండటం అంటే అది సామాన్య విషయం కాదు. ఇది కేవలం ఒక నటుడి పట్ల అభిమానం మాత్రమే కాదు.. సంప్రదాయ పార్టీల పట్ల ఓటర్లలో ఉన్న అసంతృప్తికి, మార్పు కోసం వారు పడుతున్న ఆరాటానికి సంకేతం.
హంగ్ దిశగా అడుగులు?
మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. ప్రస్తుతం విజయ్ పార్టీ 100 సీట్ల (అటూ ఇటూగా) వద్ద నిలవడంతో ఆఖరి 18 సీట్లు ఇప్పుడు కింగ్ మేకర్‌ను కాకుండా 'కింగ్'ను నిర్ణయించే స్థాయికి చేరుకున్నాయి. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే హంగ్ ఏర్పడితే తమిళనాడు రాజకీయాలు అత్యంత క్లిష్ట దశకు చేరుకుంటాయి.
ఒంటరి పోరాటమా?
విజయ్ మొదటి నుండి తాను స్వతంత్రంగానే ఉంటానని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని చెబుతూ వచ్చారు. ఒకవేళ 10-15 సీట్ల తేడాతో అధికారం ఆగితే ఆయన తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారా లేదా మద్దతు కోరుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అన్నాడీఎంకే లేదా డీఎంకేలతో చేతులు కలపడం అనేది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా డీఎంకే వ్యతిరేక ఓటుతో గెలిచిన పక్షంలో మళ్లీ వారితోనే జతకట్టడం సాహసోపేతమైన నిర్ణయమే అవుతుంది.
కీలకమైన చివరి రౌండ్లు
తమిళనాడు ఎన్నికల్లో ఎప్పుడూ చివరి రౌండ్ల ఓట్లు ఫలితాలను తలకిందులు చేస్తుంటాయి. తక్కువ మెజారిటీ ఉన్న నియోజకవర్గాల్లో ఫలితం ఏటు తిరిగినా అది ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీలు 5-10 సీట్లు గెలుచుకుంటే వారు టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ఎవరి మద్దతు లేకుండానే విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం మెండుగా ఉంది.
ఫలితం ఏదైనా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఉద్భవించిందని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టిన నటుడిగా విజయ్ తన ముద్ర వేశారు. హంగ్ ఏర్పడినా లేదా చివర్లో విజయ్ మేజిక్ ఫిగర్ దాటినా... తమిళనాడు రాజకీయాల్లో "దళపతి యుగం" మొదలైందనేది మాత్రం నిర్వివాదాంశం. వచ్చే కొన్ని గంటలు తమిళనాడు భవిష్యత్తునే కాదు, దక్షిణాది రాజకీయ గమనాన్ని కూడా నిర్ణయించబోతున్నాయి.
