ద్రవిడ రాజ్యంలో తెలుగు ‘పవర్’.. తమిళనాట పాలిటిక్స్ లో మనవాళ్ల హవా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజల తీర్పు ఉత్కంఠ రేపుతోంది. ఆ రాష్ట్రంలో దాదాపు 40 శాతం ఓటర్లు తెలుగువారే కావడం గమనార్హం.
By: Tupaki Political Desk | 16 April 2026 12:00 AM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజల తీర్పు ఉత్కంఠ రేపుతోంది. ఆ రాష్ట్రంలో దాదాపు 40 శాతం ఓటర్లు తెలుగువారే కావడం గమనార్హం. దీంతో ఎన్నికల్లో తెలుగు ప్రజలు నిర్ణయాత్మకశక్తిగా మారారని అంటున్నారు. పార్టీలు కూడా తెలుగు వారిని ప్రసన్నం చేసుకునేలా పావులు కదుపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు ఓటర్లను ఆకట్టుకునే విధంగా కులాలు, మతాల ప్రాతిపదికన సీట్లు కేటాయించాయి. ద్రవిడ భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళనాడులో ఈ సారి చిత్రంగా తెలుగు నేతలకు ప్రాధాన్యం దక్కడం ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పలు నియోజకవర్గాల నుంచి తెలుగు నేతలు పోటీ చేస్తున్నారు. తెలుగు మూలాలు ఉన్న నేతల పోటీతో తమిళనాట ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడిగా మారాయి. తమిళనాడులో చాలా కాలం కలిసి ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలు కులాలు అక్కడే స్థిరపడ్డాయి. చాలామంది వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించి ఆర్థికంగా స్థిరపడ్డారు. కొందరు రాజకీయాల్లోనూ తమ హవా చూపుతున్నారు. గతంలో స్వల్పంగా ఉండే తెలుగు నేతల ప్రభావం ఈ సారి చాలా ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు.
తమిళనాడులోని చెన్నైతోపాటు పలు ప్రధాన నగరాల్లో తెలుగు వారు స్థిరపడ్డారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు చెన్నై చుట్టుపక్కల నివసిస్తున్నారు. వీరిలో కమ్మ, రెడ్డి, కాపు, ఆర్యవైశ్య, క్షత్రియ, ఆదిఆంధ్ర, అరుంధతియర్లు, బేరి వైశ్య, 24-మనై తెలుగు చెట్టియార్లు, యాదవ, పద్మశాలీ సామాజికవర్గాల వారు ఎక్కువగా ఉన్నారని అంచనా. మొత్తం ఓటర్లలో 40 శాతం వరకు తెలుగు మూలాలు ఉన్నవారు తెలుగువారిని ఆకర్షించేలా ఈ సారి పార్టీలు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో అధికార డీఎంకే, ప్రతిపక్షం ఏఐడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ పోటీని మరింత రసవత్తరంగా మార్చేస్తూ సినీ నటుడు దళపతి విజయ్ పార్టీ టీవీకే గట్టిగా పోరాడుతూ త్రిముఖ పోరుగా మార్చేసింది. ఇక విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన ఎన్నికల్లో మూడు పక్షాలు తెలుగు నేతలు, తెలుగు కులాలకు చెందిన నేతలకు పెద్దపీట వేశాయని అంటున్నారు. డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు తెలుగు నేతలకు ఇంతకుముందు ఎన్నడూ లేనట్లు టికెట్లు కేటాయించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా బరిలో నిలిచారు. ఈ వర్గానికి చెందిన 11 మందికి డీఎంకే టికెట్లు ఇవ్వగా, ఏఐడీఎంకే ఏడుగురిని బరిలోకి దింపింది. అదేవిధంగా కాపు సామాజికవర్గం నేతలు డీఎంకే తరఫున ఏడుగురు, ఏఐడీఏంకే తరఫున నలుగురు పోటీ చేస్తున్నారు. కాగా, ఏపీలో బలమైన సామాజికవర్గంగా చెలామణి అవుతున్న రెడ్డి కులానికి చెందిన నేతలు రెండు ప్రధాన కూటముల నుంచి ఐదేసి టికెట్లు దక్కించుకున్నారు. ఇక తెలుగు సంతతిగా చెప్పే ఇసై ద్రావిడ/ఇసై వెల్లలార్ కులానికి డీఎంకే 4 సీట్లు కేటాయించింది. అదేవిధంగా 24 మనై తెలుగు శెట్టియార్ వర్గానికి ఏఐడీఎంకే కూటమి 3 సీట్లు కేటాయించింది. అదేవిధంగా వెలమ సామాజికవర్గానికి ఒక టికెట్ ఇచ్చింది.
మొత్తంగా తమిళనాడులో తెలుగు సంతతికి చెందిన దాదాపు 30 మందికి పైగా నేతలు పోటీ చేస్తుండటం గమనార్హం. ఎన్నికలకు ముందు తమ సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీకి చెందిన పలు కుల సంఘాల నాయకులు తమిళనాడులో సభలు, సమావేశాలు నిర్వహించి డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్ కోయంబత్తూరులో భారీ సమావేశం నిర్వహించి తమ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు కుల సంఘాల నేతలు తమిళనాట హడావుడి చేశారు. ఈ క్రమంలోనే డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు తెలుగువారికి పెద్దపీట వేయడం చర్చనీయాంశంగా మారింది.
