Begin typing your search above and press return to search.

రజనీకాంత్ ఎవరికి ఓటేశారో చూస్తారా? తమిళనాడు ఎన్నికల్లో మీడియా అత్యుత్సాహం

సెన్సేషనలిజం కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది.

By:  Tupaki Desk   |   24 April 2026 3:01 PM IST
రజనీకాంత్ ఎవరికి ఓటేశారో చూస్తారా? తమిళనాడు ఎన్నికల్లో మీడియా అత్యుత్సాహం
X

సెన్సేషనలిజం కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల్లో మీడియా పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలబ్రెటీలు ఓటువేసేటప్పుడు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా, ఏకంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి, వారు ఎవరికి ఓటు వేస్తున్నారో బహిర్గతం చేసే ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రెటీలు ఎవరైనా ఓటు వేసేందుకు వస్తే మీడియా కవర్ చేస్తుంది. ఇది సహజమే అయినప్పటికీ తమిళనాడులో గురువారం జరిగిన ఎన్నికల్లో పలువురు సెలబ్రెటీలు ఓటువేసే సమయంలో ఈవీఎంను సైతం చిత్రీకరించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని అంటున్నారు.

ఎన్నికలు అంటేనే మీడియా హడావుడి సహజంగా ఉంటుంది. ఇక పోటీ ప్రపంచంలో కొన్ని చానళ్లు సెన్సేషన్ కోసం పరితపిస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్ బూతుల్లో ఎలక్ట్రానిక్ డివైజ్ లు తీసుకువెళ్లడమే నేరమైతే, తమిళనాడు ఎన్నికల్లో పోలింగ్ బూతులోపల కూడా లైవ్ వీడియో చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా సెలబ్రెటీలు వచ్చిన సమయంలో మీడియా అన్ని హద్దులు దాటేసిందని, సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు వేసే సమయంలో మీడియా చూపిన అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న సమయంలో, ఆయన ఏ పార్టీకి ఓటు వేస్తున్నారో చూపించేందుకు మీడియా కెమెరాలు తీవ్రంగా ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఓటు వేయడం అనేది అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రక్రియ, కానీ మీడియా కెమెరాలు నేరుగా ఈవీఎం ఆపరేటింగ్‌ను చిత్రీకరించడం నియమాలకు విరుద్ధమని అంటున్నారు. రజనీకాంత్ తోపాటు టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్ విషయంలోనూ మీడియా ఎక్కువ హడావుడి చేసిందని అంటున్నారు.

సాధారణంగా పోలింగ్ కేంద్రాల లోపలికి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను అనుమతించడంలో ఎన్నికల కమిషన్ చాలా కఠినంగా ఉంటుందని అంటున్నారు. కానీ, తమిళనాడులో మీడియా కెమెరాలు నేరుగా బూత్‌ల లోపలికి ఎలా వెళ్లగలిగాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటు గోప్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నప్పటికీ, వార్తా ఛానళ్లు రేటింగ్స్ కోసం నిబంధనలను పక్కన పెట్టడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదన్న విషయాన్ని మీడియా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓటు హక్కు గోప్యతను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. మీడియా తన పరిధిని తెలుసుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయని అంటున్నారు.