Begin typing your search above and press return to search.

తమిళనాడులో పరాకాష్టకు చేరిన ప్రలోభాల రాజకీయం.. డైరెక్టుగా బంగారం పంపిణీ..!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారత్.. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో పండుగ అంటే ఎన్నికలే.. ఇలాంటి పండగ వాతావరణాన్ని చెరిపేసేందుకు కొందరు కుయుక్తులు పన్నుతుంటారు.

By:  Tupaki Political Desk   |   23 April 2026 11:21 AM IST
తమిళనాడులో పరాకాష్టకు చేరిన ప్రలోభాల రాజకీయం.. డైరెక్టుగా బంగారం పంపిణీ..!
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారత్.. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో పండుగ అంటే ఎన్నికలే.. ఇలాంటి పండగ వాతావరణాన్ని చెరిపేసేందుకు కొందరు కుయుక్తులు పన్నుతుంటారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ కానుకలు, బంగారం పంపిణీ చేస్తుంటారు. ఈ వార్తలు వింటుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు వెళ్తుందోనని ఆందోళన కలగడం సహజం. తమిళనాడు రాజకీయాల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం కొత్తేమీ కాకపోయినా, ఈసారి 'బంగారు ముక్కు పుడకల' వరకు వెళ్లడం అనేది పరాకాష్ట. ఈ విచారకరమైన, ఆశ్చర్యకరమైన పరిణామం.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ప్రలోభాల పర్వం’. రేపు ఉదయం ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించాల్సి ఉండగా, ఈ రోజు రాత్రికి రాత్రే వారి మనసును మార్చేందుకు రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. గతంలో కుక్కర్లు, మిక్సీలు, గైండర్లు ఇచ్చే సంస్కృతి నుంచి, ఇప్పుడు నేరుగా బంగారు ఆభరణాలను ఇంటింటికీ పంపిణీ చేసే స్థాయికి చేరడం భారతీయ ఎన్నికల వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం, పోలింగ్‌కు 48 గంటల ముందు సైలెంట్ పీరియడ్ (ప్రచారాలు నిషేధం.. ప్రలోభాలు నిషేధం) మొదలవుతుంది. ఈ సమయంలో ఎటువంటి ప్రచారం నిర్వహించవద్దు. కానీ, ఇదే సమయాన్ని రాజకీయ పార్టీలు తమ ‘క్యాష్ అండ్ గిఫ్ట్’ పంపిణీకి అనుకూలంగా మార్చుకుంటున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, పార్టీ మేనిఫెస్టో కాపీల మధ్యలో బంగారు ముక్కు పుడకలను పెట్టి గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నారు. కేవలం వస్తువులే కాకుండా, ఈసారి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా ఓటర్ల ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయని సమాచారం.

దక్షిణ భారతంలో ఈ ధోరణి ఎందుకు?

దక్షిణ భారతంలో ముఖ్యంగా తమిళనాడులో ఓటర్లను ప్రభావితం చేయడానికి ‘బహుమతులు’ ఇవ్వడం ఆచారంగా మారింది. దీని వెనుక కొన్ని సామాజిక-రాజకీయ కారణాలున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ అతి స్వల్ప ఓట్ల తేడాతో ఉండడం వల్ల, ప్రతి ఒక్క ఓటును కొనడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. సామాన్యుడికి ఈ వస్తువులు లేదంటే డబ్బులు ఆ సమయానికి పెద్ద ఉపశమనంగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల వారు తమ ఐదేళ్ల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు.

ఎన్నికల సంఘం నిఘా ఏది?

ఎన్నికల సంఘం వేల కోట్ల రూపాయలను సీజ్ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పంపిణీలు మాత్రం ఆగడం లేదు. తనిఖీలు ముమ్మరం చేసినా, స్థానిక నెట్‌వర్క్ తో పార్టీ కార్యకర్తలు పోలీసుల కళ్లు గప్పి గిఫ్టులను ఓటర్ల వద్దకు చేరుస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, పంపిణీ జరగకుండా ఆపడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి.

దీనివల్ల వచ్చే నష్టం ఎవరికి?

ఓటును అమ్ముకోవడం వల్ల తాత్కాలికంగా కొంత లబ్ధి చేకూరినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది ప్రజలకే నష్టం. డబ్బులిచ్చి ఓట్లు కొన్న నాయకుడిని ప్రజలు ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోతారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేసే నాయకుడు, అధికారం రాగానే అంతకంటే ఎక్కువ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. దీనివల్ల ప్రజా సంక్షేమం కుంటుపడుతుంది.

చట్టాలు, నిబంధనలు ఎన్ని ఉన్నా.. ఓటరు తన ఓటు విలువను గుర్తించనంత కాలం ఈ 'బంగారు' రాజకీయం ఆగదు. ఐదేళ్ల పాలనను ఒక్క రాత్రి ఇచ్చే కానుకతో సరిపోల్చుకోవడం ప్రజాస్వామ్యానికే అవమానం. రేపు పోలింగ్ బూత్‌కు వెళ్లేటప్పుడు ఓటర్లు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకుని, స్వార్థపూరిత కానుకల కంటే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారని ఆశిద్దాం.